రాజకీయ వ్యూహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌పై  ఛీటింగ్ కేసు నమోదైంది. తన ఆలోచనను కాపీ చేసి ప్రశాంత్‌ కిషోర్‌... 'బాత్‌ బీహార్‌ కీ' కార్యక్రమాన్ని సెట్ చేశారంటూ బీహార్‌... మోతీహారీకి చెందిన యువకుడు గౌతమ్‌  ఇచ్చిన  కంప్లైంట్ పై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

 

ప్రశాంత్ కిషోర్. ఎన్నికల వ్యూహకర్తగా ఇతనికి బాగా డిమాండ్ ఉంది.  రాజకీయ పార్టీలు పీకే ప్లానింగ్స్  కోసం పోటీ పడుతుంటాయి. తమ రాజకీయ వ్యూహకర్తగా నియమించుకోవాలని  తాపత్రయపడుతుంటాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఇప్పుడు తాజాగా పీకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తన సలహాలు సూచనలు అందిస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారు. ఆయనకు  బెంగాల్‌ ప్రభుత్వం జడ్‌ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకోవడం  ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. అయితే ఈ తరుణంలో పీకేపై చీటింగ్ కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది.  

 

తన ఆలోచనలు కాపీ చేసి బాత్ బీహార్ కీ అనే కార్యక్రమాన్ని తయారు చేశారని మోతీహారి కి చెందిన గౌతమ్ అనే యువకుడు  పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. తాను జనవరిలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెడితే, ప్రశాంత్ కిషోర్ ఫిబ్రవరిలో బాత్ బీహార్ కి కార్యక్రమాన్ని మొదలుపెట్టారని, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను పోలీసులకు అందజేశారు గౌతమ్. దీంతో పోలీసులు ప్రశాంత్ కిషోర్ పై   కేసు  ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.


   
కోటి మంది యువతీ యువకుల అభిప్రాయాల్ని తెలుసుకోవడడం కోసం ఫిబ్రవరి 20న ప్రశాంత్‌ కిషోర్‌ 'బాత్‌ బీహార్‌ కీ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకు 100 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటిస్తానని ఆయన అన్నారు. బీహార్‌ను వచ్చే 15 ఏళ్లలో దేశంలోని 10 గొప్ప రాష్ట్రాల్లో ఒకటిగా చేస్తానన్నారు. ఈ తరుణంలో ఆయనపై కేసు నమోదైంది. దీని వెనక జేడీయూ హస్తం ఉండి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  

కొంతకాలంగా పీకే  కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నారు. మోడీ సర్కారు తీసుకువచ్చిన చాలా చట్టాలకు వ్యతిరేకంగా పీకే మాట్లాడుతున్నారు. తాజాగా సీఏఏ ను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశారు.  ఈ నేపధ్యంలోనే  నితీష్ నేతృత్వంలోని జేడీ యూ లో ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రశాంత్ కిషోర్ పై వేటు వేశారు. అయినప్పటికీ పీకే తన స్టైల్ మార్చుకోలేదు. ఇక తాజాగా ఆయనపై చేటింగ్ కేసు నమోదు చెయ్యటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: