ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే మొదట గుర్తొచ్చేది టీడీపీ అధినేత చంద్రబాబు పేరే. ఆయనే బోలెడు సార్లు ‘నా 40 ఏళ్ల రాజకీయ జీవితం’ అంటూ పాఠాలు చెబుతారు. అయితే ఏపీలో చంద్రబాబే కాకుండా 40 ఇయర్స్ రాజకీయ అనుభవం గల నేతలు చాలమందే ఉన్నారు. అలా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం గల నాయకుల్లో  ప్రకాశం జిల్లాకు చెందిన కరణం బలరాం కూడా ఒకరు.

 

చంద్రబాబు సమకాలీకుడుగా కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం మొదలుపెట్టిన కరణం 1978లోనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అప్పుడే తనకొచ్చిన మంత్రి పదవి అవకాశాన్ని.. తన మిత్రుడు చంద్రబాబు కోసం త్యాగం చేశారని ఇప్పటికీ ప్రచారంలో ఉంది. అయితే అప్పుడు పోయిన మంత్రిపదవి ఇప్పటికీ దక్కలేదు. కానీ తర్వాత చంద్రబాబుని అనుసరించి టీడీపీలోకి వెళ్ళిన కరణం 1978 తర్వాత మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు.

 

ఇక 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న కరణం, తన తనయుడు వెంకటేష్‌ని అద్దంకి బరిలో పోటీకి దించారు. ఆ ఎన్నికల్లో వెంకటేష్ అప్పుడు వైసీపీ నుంచి పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ చేతిలో ఓటమి పాలయ్యాడు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో కరణంకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది గానీ, మంత్రి పదవి మాత్రం దక్కలేదు. 2019 ఎన్నికలకొచ్చేసరికి కరణం బలరాం చీరాల నుంచి బరిలో దిగి మంచి మెజారిటీతో ఆమంచి కృష్ణమోహన్‌పై విజయం సాధించారు.

 

అయితే పార్టీ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో కరణం నిదానంగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. కుమారుడు సాయంతో నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తాజాగా పెన్షన్, రేషన్ కార్డుల తొలగింపుపై ప్రజలకు అండగా నిలుస్తున్నారు. కాకపోతే ఈయనకు జిల్లా వైసీపీ నేతలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉండటంతో, ప్రభుత్వం మీద పెద్దగా విమర్శలు చేయడం లేదు. దీంతో ఈయన వైసీపీలోకి వెళ్లిపోతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది.

 

అయితే ప్రచారం అలాగే ఉంది గానీ, ఈయన మాత్రం టీడీపీలోనే ఉన్నారు. అలా అని రానున్న రోజుల్లో బాబుకు హ్యాండ్ ఇవ్వరనే గ్యారెంటీ కూడా లేదని తెలుస్తోంది. మొత్తానికైతే 40 ఇయర్స్ ఇండస్ట్రీ పెద్దాయన కాస్త ఆచి తూచి అడుగేలేస్తున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: