కరోనా చైనా దాటి ప్రపంచ దేశాలవైపు కోరలు చాస్తోంది.  బాధితుల సంఖ్య లక్షను దాటేలా కనిపిస్తోంది. నిన్నటిదాకా చైనాలో ర్యాపిడ్‌ గా కేసులు నమోదైతే, ఇప్పుడు దక్షిణ కొరియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బారత్‌ ముందు జాగ్రత్తగా వీసా ఆర్‌ ఎరైవల్‌ ని రద్దు చేసింది. 

 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే కరోనా మహమ్మారి చైనాలో 2810మందిని బలి తీసుకుంది. మరో 78,600మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 51దేశాల్లో 82వేలకు మందికి పైగా ఆసుపత్రుల్లో చేరారు. 

 

ఇటలీలో కరోనా పాజిటివ్ కేసులు 650కు చేరుకోగా, నెదర్లాండ్స్ లో తొలి కరోనా కేసు నమోదయింది. ఇటు సౌత్ కొరియాలో 13మంది మృత్యువాత పడగా బాధితుల సంఖ్య 2000 దాటింది.  చైనాలో కాస్త తగ్గుముఖం పట్టిన వైరస్ వ్యాప్తి దక్షిణ కొరియాలో విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే కొత్తగా 256 కేసులు నమోదయ్యాయి. వ్యాధికి కేంద్రంగా ఉన్న దైగు నగరంలోనే 90శాతం కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 

 

గురువారం నార్తర్న్ ఐర్లాండ్, బ్రెజిల్, నెదర్లాండ్స్లో తొలి కరోనా కేసు నమోదైంది. ఇరాన్లో ఇప్పటివరకు వైరస్ ధాటికి 26 మంది చనిపోయారు. 245 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. వీరిలో ఇద్దరు ఎంపీలు, ఓ మంత్రి, ఆ దేశ ఉపాధ్యక్షురాలు కూడా ఉన్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జపాన్, ఇరాక్లో పాఠశాలల్ని మూసివేశారు. సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా విదేశీ పర్యాటకుల్ని అనుమతించడం లేదు. ఇటలీలో మృతుల సంఖ్య 17కు చేరింది. మొత్తం 11 పట్టణాల్లోని ప్రజలు నిర్బంధంలో ఉన్నారు. కరోనా భయాలతో అంతర్జాతీయ మార్కెట్లు భారీ కుదుపులకు లోనవుతున్నాయి. అమెరికా, ఐరోపా, ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్ని మూటగట్టుకుంటున్నాయి. ఉత్తర కొరియాపై ఉన్న ఆంక్షల్ని కరోనా విజృంభణ నేపథ్యంలో మానవతా దృక్పథంలో సడలిస్తున్నారు.

 

మరోపక్క సౌదీ అరేబియా ఉమ్రాకు వచ్చే విదేశీయుల ప్రవేశాన్ని గురువారం నిలిపివేసింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందిన దేశాల నుండి పర్యాటకులను ఇక్కడికి అనుమతించడం లేదు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మదీనా మక్కా అనే రెండు ప్రదేశాలకు సౌదీ అరేబియా నిలయం. ఈ సస్పెన్షన్లు తాత్కాలికమైనవని, వీటి గడువుకు కాలపరిమితి లేదని స్పష్టం చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ ఆయా దేశాల నుంచి వచ్చేవారికి వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని రద్దు చేసింది. జపాన్ లో చిక్కుకున్న భారతీయులను ఢిల్లీకి తరలిస్తోంది కేంద్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: