తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్కెచ్ ఫ‌లించింది. గ‌త ఏడాది రికార్డు స‌మ‌యం పాటు కొన‌సాగిన‌ ఆర్టీసీ సమ్మె ఊహించ‌ని రీతిలో...చర్చలతో ముగిసిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేసిన దిశానిర్దేశంతో అధికారులు చేపట్టిన సంస్కరణలు ఆర్టీసీ లాభాల బాట న‌డుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఈ లెక్క‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ప్రతిఏటా రూ.450 కోట్ల నష్టాలను మూటగట్టుకుంటున్న ఆర్టీసీ 2019-20 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఆశాజనకంగా పనిచేస్తుంద‌ని అంటున్నారు. 

 


 అంతేకాకుండా గత ఏడాది సమ్మెకు ముందు గ్రేటర్‌ ఆర్టీసీ ఆదాయం  రూ.3.06 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.3.27 కోట్లకు పెరిగింది. ఆర్టీసీలో అధికారులు, ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడటం, కండక్టర్లు, డ్రైవర్లు ముఖ్యమంత్రి చెప్పినట్లు లాభాల్లోకి తెచ్చి బోనస్‌ తీసుకుందామనే లక్ష్యంతో పనిచేస్తుండటం, ఆపరేషన్‌ రేషియో(ఓఆర్‌)ను పెంచుకోవడం వంటి చర్యలతో డిసెంబర్‌ 2019 నుంచి ఫిబ్రవరి వరకు ఆదాయం పెంచుకుంటూ వస్తుందని ఉన్నతాధికారులు అంటున్నారు. పెరిగిన చార్జీలతో పాటు రూట్ల రీ షెడ్యూలింగ్‌, బస్సులు ఖాళీగా రోడ్ల మీద ప్రయాణించకుండా ప్రయాణికులు నిండుగా ఉండేట్లు, రద్దీ సమయాల్లో ఎక్కువ ట్రిప్పులు నడుపుతుండటంతో నష్టాలను తప్పించుకోవడానికి ఆర్టీసీ ఆదాయ మార్గాల వైపు ప్రయణిస్తుంద‌ని అంటున్నారు.

 


సమ్మెకు ముందు 3,560 బస్సులుండగా వీటిలో కాలం చెల్లిన బస్సులను ఆర్టీసీ అధికారులు తీసివేయగా 2,800 బస్సులు మిగిలాయి. బస్సులు తగ్గినా ప్రయాణికులు తగ్గకపోవడంతో పాటు నిర్వహణ వ్యయం తగ్గడం వల్ల రెవెన్యూ ఆటోమేటిక్‌గా పెరిగింది. సమ్మెకు ముందు ఎర్నింగ్‌ ఫర్‌ కిలోమీటర్‌(ఈపీకే)  కేవలం కిలోమీటరుకు వచ్చే ఆదాయం రూ.26 ఉండగా ప్రస్తుతం 6 రూపాయలు పెరిగి 32కు చేరింది. రాష్ట్రంలో ఏ జిల్లాలోను కిలోమీటరుకు ఆదాయం పెరుగలేదని గ్రేటర్​ ఆర్టీసీ వర్గాలు అంటున్నాయి. ఇదే సంప్రదాయం కొనసాగితే కచ్చితంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నష్టాలు లేకుండా లాభాల్లోకి రావడం ఖాయమని అధికారులు అంచనాకు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: