తెలుగువాడి ఆత్మగౌరవం కోసమంటూ దివంగత నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారు...అనే మాట ఎన్నోసార్లు విని ఉంటాం. అలా తెలుగోడి ఆత్మగౌరవం కోసం పెట్టిన టీడీపీ ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆయనకు పార్టీపై పెత్తనం ఎలా వచ్చింది? అనే దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే నారా వారి చేతుల్లో ఉన్న టీడీపీలో నందమూరి వారసులు ఇద్దరు మాత్రమే ఉన్నారు.  అది ఎన్టీఆర్ వారసుడుగా సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నందమూరి బాలకృష్ణ ఒకరైతే, ఇంకొకరు ఎన్టీఆర్ మరో తనయుడు దివంగత హరికృష్ణ తనయురాలు సుహాసిని.

 

బాలయ్య విషయం పక్కనబెట్టేస్తే చంద్రబాబు తన రాజకీయ అవసరాల దృష్ట్యా సుహాసినిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని, సుహాసినిని టీడీపీ తరుపున కూకట్‌పల్లి నియోజకవర్గ బరిలో దింపిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఘోరంగా ఓడిపోయారు. ఇక అదే ఎన్నికల తర్వాత తెలంగాణలో టీడీపీ కనుమరుగై స్టేజ్‌కు వచ్చేసింది, ఆ పార్టీ నేతలతో పాటు, కేడర్ కూడా టీఆర్ఎస్, బీజేపీల్లోకి వెళ్లిపోయింది.

 

అయితే పార్టీ లేదని తెలిసిన సుహాసిని మాత్రం తెలంగాణలో పని చేస్తూనే ఉన్నారు. ఏదొక కార్యక్రమం పేరుతో ఆమె పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే అలా తెలంగాణలో కష్టపడుతున్న ఆమెని ఏపీలోకి తీసుకురావాలని టీడీపీలో ఉన్న నందమూరి అభిమానులు కోరుతున్నారు. తెలంగాణలో భవిష్యత్‌లో ఎన్నికలు వచ్చి, మళ్ళీ ఆమె కూకట్‌పల్లి బరిలో పోటి చేసిన ఓడిపోతుందని, కాబట్టి ఆమెని ఏపీలోకి తీసుకొస్తేనే బెటర్ అంటున్నారు.

 

ఇప్పటికే సుహాసిని అమరావతి ఉద్యమంలోకి వచ్చారు. అక్కడి రైతులకు మద్ధతు తెలిపారు. ఇలాగే ఆమెని ఏపీలో ఉన్న మరిన్ని సమస్యల మీద పోరాటం చేయించాలని, అప్పుడు పార్టీ కూడా కాస్త మైలేజ్ పెరుగుతుందని అంటున్నారు. ఏమీలేని తెలంగాణలో చేయడం వల్ల పావలా ఉపయోగం లేదంటున్నారు. అలాగే ఆమెకు పార్టీలో కూడా కీలక పదవి ఇచ్చి, రాబోయే 2024 ఎన్నికల్లో ఏపీలోనే పోటి చేయించాలని నందమూరి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి సుహాసిని రాజకీయ భవిష్యత్ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?

మరింత సమాచారం తెలుసుకోండి: