తెలంగాణ విద్యుత్ శాఖ మరో రెండు అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా, రాష్ట్రంలో ఈ రోజు ఉదయం 13,168 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా తలసరి విద్యుత్ వినియోగం నమోదైంది. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిమాండ్ ఏర్పడినప్పటికీ ఎక్కడా కరెంటు కోతలు, లోటు లేకుండా విద్యుత్ సంస్థలు విద్యుత్ సరఫరా చేయగలిగామంటున్నారు విద్యుత్‌ ఉన్నతాధికారులు.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వాడకం చరిత్రను తెలంగాణ తిరగరాసింది. 2014 మార్చి 23న 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడగా.. ఇప్పుడు తెలంగాణలో అంతకు మించిన డిమాండ్ వచ్చింది. గత ఏడాది ఇదే రోజు తెలంగాణలో గరిష్ట డిమాండ్ 9,770 నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 34 శాతం అధిక డిమాండ్ వచ్చింది. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా, ఎత్తిపోతల పథకాల నిర్వహణ, పరిశ్రమల సంఖ్య పెరగడం తదితర కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో అధిక డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఎస్పిడిసిఎల్, ఎన్పిడిసిఎల్ పరిధిలోని తెలంగాణ ప్రాంతంలో 5,661 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. రాష్ట్రం ఏర్పడిన పరిస్థితితో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన డిమాండ్ 132.6 శాతం అధికమని ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.

 

దేశ సగటును మించిన విద్యుత్ వినియోగం... తెలంగాణలో గరిష్ట డిమాండ్ తో పాటు విద్యుత్ వినియోగం కూడా అంతకంతకూ పెరుగుతున్నది. 2014లో తెలంగాణ రాష్ట్రంలో 47,338 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా, 2018-19 సంవత్సరంలో 68,147 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 44 శాతం అధిక విద్యుత్ వినియోగం జరిగింది. ఇదే సమయంలో దేశ సగటు 23 శాతంగా మాత్రమే నమోదైంది. భారీగా పెరిగిన తలసరి విద్యుత్ వినియోగం విశ్వవ్యాప్తంగా ప్రగతి సూచికలుగా గుర్తించే అంశాల్లో తలసరి విద్యుత్ వినియోగం ఒకటని విద్యుత్ నిపుణులు అంటున్నారు. దేశ వ్యాప్తంగా సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,181 మెగావాట్లు కాగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 1,896 మెగావాట్లు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 1,356 మెగావాట్లుంటే, ఆరేళ్లలో 39.82 శాతం పెరిగింది. తెలంగాణ వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక విప్లవాత్మక విధాన నిర్ణయాల వల్ల విద్యుత్ వినియోగం అంతకంతకూ పెరుగుతూ వచ్చిందని విద్యుత్ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.

 

వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతుండడం వల్ల వ్యాపార, వాణిజ్య కనెక్షన్లు కూడా పెరిగాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కొత్త విద్యుత్ కనెక్షన్ల వృద్ధి రేటు అధికంగా ఉందని విద్యుత్ ఇంజనీర్స్ స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మొత్తం విద్యుత్ కనెక్షన్లు 1,11,19,990 ఉంటే, నేడు రాష్ట్రంలో 1,54,14,451 కనెక్షన్లు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన నాటితో పోలిస్తే 38.61 శాతం అధికంగా కనెక్షన్లున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు కేవలం 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉండేదని, కానీ నేడు 16,246 మెగావాట్లు అందుబాటులో ఉందన్నారు. నాడు కేవలం 74 మెగావాట్ల సోలార్ విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంటే, నేడు 3,650 మెగావాట్ల సోలార్ సామర్థ్యం ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన నాడు 233 సబ్ స్టేషన్లుంటే, నేడు 347 సబ్ స్టేషన్ లు ఉన్నాయన్నారు.

 

తెలంగాణ రాష్ట్రం ఇప్పుడున్న డిమాండ్ కన్నా ఇంకా ఎక్కువ డిమాండ్ వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. రాబోయే వేసవికాలంలో డిమాండ్ కు తగ్గ సప్లయ్ ఎలాంటి కరెంటు కోతలు లేకుండా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: