చైనాలో పుట్టి ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ మ‌హమ్మారిగా మారి వంద‌లాది మందిని పొట్ట‌న‌బెట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఆ ప్రాణాంత‌క వైర‌స్ ఛాయ‌లు.. ఇప్పుడు యూరోప్ దేశాల‌ను ఊపిరాడ‌నివ్వ‌డంలేదు. అనేక యూరోప్ దేశాల్లో.. క‌రోనా తొలి కేసులు న‌మోదు అయ్యాయి.  ఆస్ట్రియా, క్రొయేషియా, స్విట్జ‌ర్లాండ్, ఇట‌లీ దేశాల్లోనూ కేసులు రిపోర్ట్ అయ్యాయి. లాటిన్ అమెరికా దేశ‌మైన బ్రెజిల్‌లో కూడా క‌రోనా కేసు న‌మోదు అయ్యింది. భార‌త్ సైతం ఈ వ్యాధి విష‌యంలో వ‌ణికిపోతోంది. అయితే, తాజాగా తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఈ విష‌యంలో ప్ర‌త్యేక చొర‌వ తీసుకున్నారు.  చికెన్‌పై వస్తున్న పుకార్ల నేపథ్యంలో అవగాహన కల్పనే లక్ష్యంగా నెక్‌, పౌల్ట్రీ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్య‌క్ర‌మంలో చికెన్ రుచి చూశారు.

 


హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో నెక్‌, పౌల్ట్రీ సమాఖ్య ఆధ్వర్యంలో చికెన్‌, ఎగ్‌ మేళా జరిగింది. మంత్రులు కేటీఆర్‌, ఈటెల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎంపీ రంజిత్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు చికెన్ ఆర‌గించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. `చికెన్‌పై దుష్ప్రచారాలు, అపోహలు నమ్మొద్దు. ఎగ్‌, చికెన్‌, మటన్‌, ఫిష్‌ వేటికీ కరోనా లేదు. మనం వండుకునే విధానంలో అలాంటి వైరస్‌లు బతకనే బతకవు.  వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం చికెన్‌, గుడ్లు పంపిణీ చేస్తోంది. కరోనా వైరస్‌కు చికెన్‌, గుడ్లకు ఎలాంటి సంబంధం లేదు.`` అని క్లారిటీ ఇచ్చారు.

 

ఈ సంద‌ర్భంగా కీల‌క‌మైన సామాజిక సందేశాన్ని సైతం కేటీఆర్ అందించారు. ``వ‌రి, పత్తి, మొక్కజొన్న మన దగ్గ‌ర పండే ప్రధాన పంటలు. పౌల్ట్రీ ఇండస్ట్రీపై మొక్కజొన్నతో పాటు పలు రకాల పంటలు పండించే రైతులు ఆధారపడి ఉన్నారు. వారిని డీలా పరిచేలా తప్పుడు ప్రచారాలు తగదు. పౌల్ట్రీ పరిశ్రమ  పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తూ రైతులకు బాసటగా నిలుస్తోంది. పలు రంగాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది.  దేశంలోనే అద్భుతమైన పౌల్ట్రీని త్వరలోనే తీసుకొస్తాం. పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తుంది.`` అని మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: