నూజివీడు మైనర్ బాలిక అత్యాచారం కేసు ఏపీలో కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 24 గంటల్లో నిందితుడిని పట్టుకున్నారు. ఓ బిర్యానీ ప్యాకెట్ కవర్ కారణంగా నిందితుడు అడ్డంగా బుక్కయ్యాడు.

 

కృష్ణా జిల్లా నూజివీడుకి చెందిన మైనర్ బాలిక తన తండ్రి కోసం ఇంటి బయట ఎదురుచూస్తోంది. ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేసిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు. ఆమె తండ్రి తనకు తెలుసని తాను తీసుకెళ్తానని నమ్మబలికాడు. అతని మాయమాటలు నమ్మిన బాలిక సైకిల్ ఎక్కింది. వ్యక్తి ఆమెను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

 

నూజివీడు ట్రిపుల్ ఐటీ వెనక ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. మైనర్ బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను అక్కడే వదిలేసి పరారయ్యాడు. బాలిక కేకలు విన్న పెట్రోలింగ్ సిబ్బంది ఆమె వద్దకు వచ్చి ధైర్యం చెప్పారు. విషయం అడిగి తెలుసుకుని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు.

 

మైనర్ బాలికపై అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఓ వ్యక్తి బాలికను సైకిల్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లడం గుర్తించారు. 

 

బాలికపై అత్యాచారం జరిగిన ట్రిపుల్ ఐటీ పరిసరాలను శోధించారు. రేప్ జరిగిన ప్రదేశంలో ఓ బిర్యానీ ప్యాకెట్ కవర్ దొరికింది. అదే నిందితుడిని పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించింది. నిందితుడు బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చినట్లు అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.

 

బిర్యానీ ప్యాకెట్‌ని స్వాధీనం చేసుకుని అది ఏ హోటల్ నుంచి తెచ్చాడో గుర్తించారు. వెంటనే ఆ హోటల్ వద్దకు వెళ్లి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో ఓ వ్యక్తి సైకిల్‌పై వచ్చి బిర్యానీ ప్యాకెట్ తీసుకెళ్లినట్లు రికార్డై ఉండడాన్ని గుర్తించారు. ఆటోడ్రైవర్ అన్నం వెంకటేశ్వరరావును రేపిస్టుగా గుర్తించి తక్షణం అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: