ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు శుభవార్త చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కుల ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం అందించనుంది. కుల ధ్రువీకరణ పత్రం కోసం తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలు సచివాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. అతి త్వరలో ప్రజలకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 
 
ఇప్పటివరకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కుల ధ్రువీకరణ పత్రాలు తహశీల్దార్లు, జిల్లా కలెక్టర్లు జారీ చేసేవారు. గ్రామ, వార్డ్ సచివాలయాలకు ప్రభుత్వం ఇకనుండి ధ్రువపత్రాలను జారీ చేసే అధికారం కల్పించనుంది. ఈ విధానం మార్చి నెల చివరి వారం నుండి అందుబాటులోకి రానుంది. మన రాష్ట్రంలో విద్య, ఉద్యోగ అవసరాల కోసం జారీ చేసే సర్టిఫికెట్లు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జారీ కానుండగా ఇతర రాష్ట్రాలలో చదివే విద్యార్థులకు మాత్రం తహశీల్దార్, తహశీల్దార్ పై స్థాయి అధికారులచే కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు కానున్నాయి. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుండి వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలనే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటోంది. సీఎం జగన్ ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల ఇంటి వద్దకు చేరాలనే లక్ష్యంతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను గ్రామ, వార్డ్ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. కుల ధ్రువీకరణ పత్రాల కోసం అభ్యర్థులు గ్రామ, వార్డ్ వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
దరఖాస్తు చేసిన 72 గంటల్లో అర్హులకు గ్రామ, వార్డ్ సచివాలయాలు కుల ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేస్తాయి. గతంలో కుల ధ్రువీకరణ పత్రాలు పొందాలంటే మూడు రోజుల నుండి 15 రోజుల వరకు సమయం పట్టేది. గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా కేవలం 72 గంటల్లో ధ్రువీకరణ పత్రాలు పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: