డిజిటల్ లావాదేవీల కోసం ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్లలో గూగుల్ పే కూడా ఒకటి. గూగుల్ పే ప్రతిరోజు ఉపయోగించే వారికి ఈ యాప్ స్క్రాచ్ కార్డుల గురించి తెలిసే ఉంటుంది. గూగుల్ పే ద్వారా 500 రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తం పంపితే లక్ష రూపాయల స్క్రాచ్ కార్డ్ వస్తుంది. కానీ ఈ స్క్రాచ్ కార్డ్ ద్వారా లక్ష రూపాయలు గెలుపొందేవారు చాలా తక్కువ. ఎక్కడ నక్క తోక తొక్కాడో తెలీదు కానీ గూగుల్ పే ద్వారా అనంతపురానికి చెందిన వ్యక్తి మాత్రం లక్ష రూపాయల రివార్డు పొందాడు. 
 
అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన సూర్యప్రకాశ్ ఫోటో స్టూడియో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రోజున గూగుల్ పే యాప్ ద్వారా సూర్యప్రకాశ్ ఓ వ్యక్తికి 3,000 రూపాయలు పంపాడు. అనంతరం లక్ష రూపాయల స్క్రాచ్ కార్డు రాగా స్క్రాచ్ చేసి ఆశ్చర్యపోయాడు. స్క్రాచ్ కార్డు ద్వారా గెలుపొందిన లక్ష రూపాయలు అతని బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. ఈ విషయం తెలియడంతో సూర్యప్రకాశ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 
 
గూగుల్ పే ద్వారా లక్ష రూపాయలు గెలుచుకోవడం తాను ఇంకా నమ్మలేకపోతున్నానని సూర్యప్రకాశ్ చెబుతున్నారు. గెలుపొందిన లక్ష రూపాయలు గోల్డ్ లోన్ తీర్చటానికి ఖర్చు చేస్తానని చెప్పారు. తాను గూగుల్ పే యాప్ ను సంవత్సరం నుండి వినియోగిస్తున్నానని ఇప్పటివరకు కేవలం 107 రూపాయలు మాత్రమే రివార్డుల రూపంలో వచ్చిందని సూర్యప్రకాశ్ తెలిపారు. శుక్రవారం స్నేహితుడు 3,000 రూపాయలు అడగగా గూగుల్ పే ద్వారా పంపానని లక్ష రూపాయలు రివార్డు రావడంతో ఆశ్చర్యపోయానని చెప్పారు. 
 
గూగుల్ పే ద్వారా లక్ష రూపాయలు రివార్డు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సోషల్ మీడియా, వెబ్ మీడియా ద్వారా సూర్యప్రకాశ్ లక్ష రూపాయల రివార్డ్ గెలుచుకున్న వార్త వైరల్ అయింది. గూగుల్ పే లాంఛింగ్ సమయంలో వినియోగదారులకు భారీ మొత్తంలో రివార్డుల రూపంలో లభించాయి. ఆ తరువాత గూగుల్ పే నుండి రివార్డులు గెలుచుకునే వారి సంఖ్య తగ్గింది. అనంతపురంకు చెందిన వ్యక్తి లక్ష రూపాయలు గెలుపొందడం స్థానికంగా హాట్ టాపిక్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: