రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. ఎవ‌రూ మ‌డిక‌ట్టుకుని కూర్చునే రోజులు లేవు! దీనికి ఎవ‌రూ అతీతు లు కూడా కారు! ఎవ‌రికి అవ‌కాశం.. ఎవ‌రి అవ‌స‌రం.. వారిది. ఈ నేప‌థ్యంలోనే ఎవ‌రికి వారు త‌మ త‌మ దారులు చూసుకుంటు న్నారు. పార్టీలే ఇలా అవ‌స‌రాల‌కు త‌గిన విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ప్పుడు.. నాయ‌కులు మాత్రం దీనికి భిన్నంగా ఎలా ఉంటారు? అందుకే నాయ‌కులు ఎంత నిజాయితీగా ఉండాల‌నుకున్నా.. ఎంత నీతిగా వ్య‌వ‌హ‌రించాల‌ని భావించినా.. ప‌రిస్థితులు వారిని కుదురుగా ఉండ‌నివ్వ‌ని మాట వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే వారు త‌మకు న‌చ్చిన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే..

 

తాను జ‌న‌సేన‌లో చేరుతున్నానంటే.. జ‌న‌సేన‌తోనే ఉంటాన‌ని అర్ధం-అంటూ గ‌తంలో వ్యాఖ్యానించిన మాజీ ఐపీఎస్ అదికారి, మాజీ సీబీఐ జేడీ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ.. త‌ర్వాత కాలంలో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విశాఖ ఎంపీగా జ‌న‌సేన టికెట్‌పై పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న పార్టీకి దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీ మార‌తార‌ని అనుకు న్నా.. మీడియా క‌థ‌నాలను ఆయ‌న ఖండించారు. మీడియాపై కూడా విమ‌ర్శ‌లు చేశారు. అయితే, త‌ర్వాత కాలంలో అంటే ఇటీవ‌ల ఆయ‌న జ‌న‌సేన‌కు దూర‌మ‌య్యారు. ప‌వ‌న్ రాజ‌కీయాల్లో ఉంటాన‌ని వ‌చ్చి సినిమాల్లోకి వెళ్లిపోవ‌డం త‌న‌ను క‌ల‌చి వేసింద‌న్న జేడీ.. ఏకంగా పార్టీకే రిజైన్ చేశారు. అప్ప‌టి నుంచి ఖాళీగా ఉంటున్న ఆయ‌న త్వ‌ర‌లోనే బీజేపీ తీర్థం పుచ్చుకోను న్నార‌ని అంటున్నారు.

 

తాజాగా ఆయ‌న బీజేపీకి మ‌ద్ద‌తుగా వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని బ‌ట్టి.. ఈయ‌న త్వ‌ర‌లోనే బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌డం ఖాయమ‌నే వ్యాఖ్య‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరిన‌ట్ట‌యింది. మన దేశం ధర్మశాల కాదని, దేశ భద్రత చాలా ముఖ్యమని లక్ష్మీనారాయణ అన్నారు. ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడమే సీఏఏ ఉద్దేశమని ఆయన స్పష్టంచేశారు. అసోంలో శరణార్థుల కోసమే ఎన్‌ఆర్సీ తీసుకొచ్చారన్నారు. ఎన్‌ఆర్సీ వల్ల ఎవరికీ నష్టం జరగదని ప్రధాని హామీ ఇచ్చారని వ్యాఖ్యానించారు. పదేళ్లకోసారి ఎన్‌పీఆర్‌ సర్వే జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ సిటిజన్ షిప్ నిరూపించుకోవడంలో తప్పులేదన్నారు. దేశం మొత్తం బీజేపీని, మోడీని విమ‌ర్శిస్తుంటే.. ఇప్పుడు ల‌క్ష్మీనారాయ‌ణ ప‌నిగ‌ట్టుకుని వారిని స‌మ‌ర్ధించ‌డం చూస్తే.. ఖ‌చ్చితంగా ఈయ‌న‌కు క‌మ‌లం గూటిలో సీటు ఖ‌రారైన‌ట్టుగా ఉంద‌ని రాజ‌కీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: