సరైన బిల్డింగ్‌లు ఉండవు. ల్యాబ్‌లు అసలే ఉండవు. లైబ్రరీలు మచ్చుకకు కూడా కన్పించవు. ప్రభుత్వం మొత్తుకున్నా,  A.I.C.T.E హెచ్చరించినా...మార్పు రాలేదు. ఇప్పటికే సగం విద్యా సంవత్సరం గడిచిపోయింది. త్వరలోనే పరీక్షలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో రెండు వందలకు పైగా ఇంజినీరింగ్‌ కాలేజీల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. 

 

తెలంగాణలో విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకుంటున్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు. A.I.C.T.E గుర్తింపు లేకుండానే కాలేజీలు నడిపిస్తున్నాయి. 238 ప్రొఫెషనల్ కాలేజీల A.I.C.T.E గుర్తింపుపై సందిగ్దత నెలకొంది. బిల్డింగ్‌లకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో వాటి రెన్యూవల్‌ను ఆపారు. ఐతే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో రెండేళ్లు మినహాయింపు ఇచ్చింది. ఆ గడువు కూడా ముగిసింది. ఈసారి రెన్యూవల్‌కు సంబంధించి దరఖాస్తు సమయం కూడా వచ్చేసింది. కానీ మెజార్టీ కాలేజీలు మాత్రం ఇంకా దరఖాస్తు చేసుకోలేదు. 

 

మొత్తం 238 కాలేజీలు ఉంటే... జేఎన్టీయూ పరిధిలో 155, ఓయూ పరిధిలో 23 కాలేజీలు ఉన్నాయి. ఐతే మిగితా 60 కాలేజీల సంగతి తెలియదని ఉన్నత విద్యామండలి అధికారులు అంటున్నారు.  ఐతే వచ్చే విద్యా సంవత్సరానికి AICTE అనుమతి కోసం జేఎన్టీయూ పరిధిలో 82 కళాశాలలు , ఓయూ పరిధిలో 4 కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. మొత్తం 85 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. మిగతా 92 కళాశాలలు అప్లై చేసుకోలేదు.

 

ఈ కాలేజీల వ్యవహారంపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీక్ష చేశారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను A.I.C.T.Eకి పంపించాలని నిర్ణయించారు. ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రం తమ బిల్డింగ్స్‌ను  రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిని కలిశారు. A.IC.T.E చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఒకటి రెండు రోజుల్లో సీఎస్‌ను కలిసి మినహాయింపు ఇవ్వాలని కోరనున్నాయి యజమాన్యాలు. 

 

111 జీఓ పరిధిలో ఉన్న 42 కళాశాలల విషయంలో ప్రభుత్వం ఏమి చేసే పరిస్థితి లేదని, మిగతా కళాశాలల విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవచ్చని ఉన్నత విద్యామండలి వర్గాలు అంటున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: