చీడపీడల్ని ఎదిరించి... ప్రకృతిని జయించి పంటల్ని పండిచినా... దళారులు చేతుల్లో ఓడిపోతున్నారు రైతులు. తెలంగాణలోని కంది రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కొనుగోలు కేంద్రాల్లో కోటా పూర్తయిందంటున్నారు అధికారులు. మరోవైపు... తేమ శాతం ఎక్కువుందంటూ ధర తగ్గించేస్తున్నారు వ్యాపారులు. దీంతో కన్నీళ్లుపెట్టుకుంటున్నారు కంది రైతులు. 

 

ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్ యార్డులో గల మార్క్ఫెడ్ కేంద్రం వద్ద రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్ మండలం కేంద్రంలో గల కందులు కొనుగోలు కేంద్రం వద్ద కంది రైతుల ధర్నా చేస్తున్నారు. ప్రాంతం ఏదైనా రైతుల ఆందోళన ఒక్కటే. మార్కెట్‌ యార్డుకు తెచ్చిన తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం ఏమిటన్నది వాళ్ల ఆవేదన. 

 

వైరా కొనుగోలు కేంద్రంలో తేమశాతం పేరుతో కంది రైతులను ఇబ్బంది పెడుతున్నారు అధికారులు. కందులు కొనుగోలు కేంద్రం ప్రారంభించి పది రోజులు గడిచినా సేకరణ ప్రారంభించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కందులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు.

 

కందులు కొనాలంటూ ఆదిలాబాద్ జిల్లాలోనూ రోడ్డెక్కారు రైతులు. జైనాథ్ మండలం కేంద్రంలో కందులు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కోటా పూర్తవడం వల్ల ఆదిలాబాద్‌ జిల్లాలోని 9 కేంద్రాల్లో కొనుగోళ్లు ఆపేశామని అధికారులు ప్రకటించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. దిగుబడి పెంచాలంటున్న ప్రభుత్వం... పంటల కొనుగోలుకు చొరవ చూపకపోతే ఎలా ప్రశ్నిస్తున్నారు రైతులు. తమ దగ్గర దాదాపు సగం ధరకు కొంటున్న దళారులు... అదే పంటను ప్రభుత్వానికి అమ్మి లాభపడుతున్నారని... ఈ పరిస్థితిలో మార్పువాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి కంది రైతులకు కష్టాలొచ్చాయి. ఎండనకా.. వనానకా.. కష్టపడి ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వ్యాపారులు తమ కష్టాన్ని గుర్తించకుండా ధరలు తగ్గించేస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం తమ సమస్యను గుర్తించి ఆదుకోవాలని కోరుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: