రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం జరిగింది. సీఎం జగన్ తో ముఖేష్ ప్రధానంగా పరిశ్రమల ఏర్పాటు అంశం గురించి చర్చించినట్లు సమాచారం. ఏపీ రాజకీయవర్గాల్లో వీరిద్దరి భేటీ చర్చనీయాంశం అయింది. ఈ సమావేశంలో ముఖేష్ కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ పాల్గొన్నారు. 
 
సీఎం జగన్ ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఇతర పార్టీలకు విమర్శించే అవకాశం లేకుండా చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో రిలయన్స్ 1500 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నట్టు గతంలో ప్రకటన చేసింది. 
 
టీడీపీ రిలయన్స్ కొరకు భూములు కూడా కేటాయించింది. ఈ పరిశ్రమ గురించి, రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడుల గురించి జగన్ అంబానీ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముఖేష్ అంబానీకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, కొందరు వైసీపీ నేతలు గన్నవరం విమానశ్రయంలో ఘన స్వాగతం పలికారు. విజయసాయిరెడ్డి ముఖేష్ కు శాలువా కప్పి జ్ఞాపికను బహూకరించారు. 
 
భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అపర కుబేరుల జాబితాలో ముకేష్ అంబానీ ఒకరు. గత కొన్ని సంవత్సరాలుగా ఆసియాలోని అపర కుబేరుల జాబితాలో ప్రథమ స్థానంలో ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు. ఈయన గంట సంపాదన అక్షరాలా ఏడు కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఈయన ఆస్తుల విలువ 67 బిలియన్ డాలర్లు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి ముఖేష్ కలిశారు. ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.                              

మరింత సమాచారం తెలుసుకోండి: