కోవిడ్ వైరస్ దెబ్బకు చైనా మార్కెట్ కుదేలవుతే, తెలుగు రాష్ట్రాల పట్టు రైతులకు కాస్త ఊరట దక్కింది. చైనా నుంచి పట్టుగూళ్ల దిగుమతి గణనీయంగా తగ్గడంతో.. దేశీ పట్టు రైతుల గూళ్లకు మంచి గిరాకీ ఏర్పడింది. 

 

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఎవరి నోట విన్నా.. కోవిడ్ వైరస్ పేరే వినిపిస్తోంది. చైనాను అయితే ఈ వైరస్ కుదిపేస్తోంది. ఆ దేశం నుంచి ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. మనదేశం విషయానికొస్తే ప్రధానంగా కొన్ని రంగాలకు మేలు చేస్తుంటే.. కొన్ని రంగాలకు నష్టం తెచ్చి పెడుతోంది. 

 

ఏపీకి బైవోల్టేన్ పట్టుగూళ్లు భారీగా దిగుమతి అయ్యేవి. స్వదేశీపట్టుకు పోటీగా చైనా సిల్క్‌ దిగుమతి అయ్యేది. నాణ్యత బాగుండి.. ధరల్లో తేడా ఉండటంతో జాతీయ మార్కెట్‌లో మన పట్టుకు డిమాండ్‌ తగ్గింది. రేట్లు అంతంతమాత్రంగానే దక్కేవి. కోవిడ్ వైరస్‌ ప్రభావంతో చైనా సిల్క్‌ ఒక్కసారిగా ఆగింది. స్వదేశీ పట్టుకు డిమాండ్‌ రావడంతో పట్టుగూళ్ల ధరలు ఊపందుకొన్నాయి. మార్కెట్‌లో కిలో 400-500 రూపాయలు మధ్య పలికేది బైవోల్టిన్‌ పట్టుగూళ్లకు. ప్రస్తుతం ఒక్కసారిగా కిలోపై 140 రూపాయలు పెరిగింది. రైతులు, రీలర్లలో ఆనందం అంతా ఇంతా కాదు. 

 

తెలుగు రాష్ట్రాల్లోనే హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌ అగ్రగామి. ఇక్కడికి నిత్యం 3 నుంచి 4 టన్నుల పట్టుగూళ్లు వచ్చేవి. ప్రస్తుతం 10 టన్నులు వస్తున్నాయి. కోవిడ్ వైరస్‌తో ఒక్కసారిగా దిగుమతులు లేక, స్వదేశీ సిల్క్‌కు జాతీయంగా డిమాండ్‌ ఏర్పడింది. వారం రోజుల్లోనే మార్కెట్‌లో  సిల్క్‌ కిలోపై 500 వరకు పెరిగి 3,550 రూపాయల వరకు చేరింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అనంతపురం జిల్లాతో పాటు చిత్తూరు, కర్నూలు, కడప, శ్రీకాకుళం జిల్లాల నుంచి రైతులు పట్టుగూళ్లు తెస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్రల్లోనూ పలు జిల్లాల నుంచి కూడా వస్తున్నాయి. 

 

చిత్తూరు జిల్లా నుంచి బైవోల్టిన్‌ పట్టుగూళ్లు వస్తుండగా, కర్ణాటక, కర్నూలు జిల్లాల నుంచి  క్రాస్‌బీడింగ్‌ గూళ్లను రైతులు మార్కెట్‌కు తెస్తున్నారు. కోవిడ్ వైరస్ పుణ్యమా అని దేశీ పట్టు పరిశ్రమకు పూర్వకళ వచ్చిందని.. రైతులు, వ్యాపారులు కుషీగా ఉన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: