సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో మానసిక వికలాంగుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని అధికారులకు జగన్ సూచించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న జగన్ రాష్ట్రంలోని విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జగన్ అమ్మఒడి, జగనన్న వసతి దీవెన లాంటి హామీలను అమలు చేశారు. 
 
ఈరోజు జగన్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సంబంధిత అధికారులతో సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. రాబోయే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుక కిట్లు అందించాలని జగన్ సూచించారు. మనబడి నాడు నేడు, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద పథకాలపై జగన్ సమీక్ష జరిపారు. సీఎం సమీక్షలో నూతన పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్ లను పరిశీలించారు. 
 
ప్రతి నియోజకవర్గంలో ఒక మానసిక వికలాంగుల పాఠశాలను ఏర్పాటు చేసి వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పారు. కడప జిల్లా పులివెందుల విజేత స్కూల్ తరహాలో పాఠశాలలను ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో పులివెందుల మినహా ఇతర నియోజకవర్గాల్లో ఈ పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల నుండి హర్షం వ్యక్తం అవుతోంది. 
 
అధికారులకు జగన్ కాంపిటీటివ్ టెండర్లను పిలవాలని ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పారు. బెల్టు, బ్యాగు, బూట్లు, నోట్ బుక్స్ విషయంలో జగన్ పలు మార్పులు సూచించారు. విద్యార్థులకు చిన్న వయస్సు నుండే ఇంటర్నెట్ వినియోగం వలన కలిగే ఉపయోగాలను తెలియజేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇంటర్నెట్ గురించి తెలిసేలా చేయాలని చెప్పారు.                            

మరింత సమాచారం తెలుసుకోండి: