దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ఘోరమైన అల్లర్లను చూసిన తర్వాత మానవత్వం మంట కలిసిపోతుందని ఎంతో మంది భావించినప్పటికీ... మరోవైపు ఇంకా మానవత్వం మిగిలే ఉందని కొన్ని సంఘటనలను చెప్పకనే చెబుతున్నాయి.



వివరాలు తెలుసుకుంటే... ఢిల్లీ లోని శివ విహార్ లో సన్నిహితంగా, సామరస్యంగా ఉండే హిందువులు ముస్లింలు మధ్య చిచ్చు పెట్టేందుకు ఆ ప్రాంతానికి చెందిన వారే కొంతమంది ముస్లిం ఇళ్లకు నిప్పంటించారు. కానీ అక్కడ నివసిస్తున్న మరికొంతమంది ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ తమ ప్రాణాలు కాపాడుకున్నారు.



అయితే ఈ దాడులలో హిందువైనా ప్రేమ్ కాంత్ బేగెల్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఇంటి పక్కన ఉంటున్న ఒక ముస్లిం కుటుంబాన్ని కాపాడాడు. అల్లరిమూక ఓ ముస్లిం వాళ్ళ ఇళ్లకు నిప్పంటించారని తెలుసుకోగానే ప్రేమ్ కాంత్ ఏ మాత్రం ఆలోచించకుండా మంటల్లో చిక్కుకుపోయిన తన పొరుగు వారిని కాపాడాడు. తాను ఆ ఇంటి లోపలికి వెళ్లి ఐదుగురిని కాపాడాడు. ఆ తరువాత తన స్నేహితుడి తల్లిని కాపాడేటప్పుడు అతనికి తీవ్రగాయాలయ్యాయి. పాపం, 70% వరకు కాలిన గాయాలతో అతను పడిన వేదన వర్ణనాతీతం. దాడి జరిగినప్పుడు రాత్రి సమయం కావడంతో... అంబులెన్స్ ప్రేమ్ కాంత్ వద్దకు రాలేకపోయింది. దీంతో అతను తెల్లవారే వరకు కాలిన గాయాలతో బాధ పడాల్సి వచ్చింది. అయితే తన కుటుంబ సభ్యులు తెల్లవారిన తర్వాత జీటీబీ హాస్పటల్ కి అతడిని తరలించారు. ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్న ప్రేమ్ కాంత్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.




ఇకపోతే, ఒక బీజేపీ కౌన్సిలర్... ఓ ముస్లిం ఫ్యామిలీ ని దాడుల నుండి కాపాడాడు. గురుద్వార్ లో నివసించేవారు అల్లర్ల ప్రాంతం నుండి పారిపోయి వచ్చిన వారికి షెల్టర్ ఇచ్చి కాపాడారు. యమున విహార్ నివాసితులు హ్యూమన్ చైన్ గా ఏర్పడి అల్లర్లను ఐక్యమత్యంగా ఎదుర్కొని పాఠశాల విద్యార్థులను కాపాడారు. అలాగే చాలా మంది దళితులు ముస్లిం ప్రాంతాలలో అల్లర్లు జరగకుండా తమ వంతు సహాయం చేశారు. ఏదేమైనా ప్రేమ్ కాంత్ గాయాల నుండి కోలుకొని బతకాలని మనసారా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: