తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విష‌యంలో ఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రెండు సంఘ‌ట‌న‌లు, ఓ అంశం గురించి ఓవైసీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, తెలంగాణ‌లో ఓ జిల్లా క‌లెక్టరును ప్ర‌శంసించిన ఓవైసీ అదే రీతిలో అంతా ప‌నిచేయాల‌ని కోరారు. దీంతో పాటుగా ఓ వినతిని సైతం కేసీఆర్ ముందు ఉంచారు.

 

వివ‌రాల్లోకి వెళితే...హైదరాబాద్‌ టోలిచౌకిలో మార్గమధ్యంలో ఆగి దివ్యాంగుడైన మహ్మద్‌ సలీంతో సీఎం కేసీఆర్‌ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సలీంకు దివ్యాంగ పింఛన్‌, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరు అయ్యాయి. రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న మరొక ఘటనలో పింఛన్‌ రాక ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధురాలికి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ వెంటనే స్పందించి పింఛన్‌ మంజూరు చేయించారు. కలెక్టరేట్‌కు వచ్చి మెట్లపై కూర్చున్న వృద్ధురాలు అజ్మీరా మంగమ్మను గమనించిన కలెక్టర్‌ ఆమె దగ్గరకు వెళ్లి తను కూడా వృద్ధురాలి ప్రక్కనే మెట్లపై కూర్చొని సమస్యను తెలుసుకుని పరిష్కరించారు. 

 

దీనిపై హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ స్పందిస్తూ...సీఎం కేసీఆర్‌, కలెక్టర్‌ అజీం చూపించిన మార్గంలో పయనిస్తూ అందరు సీఎంలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఎమ్మెల్యే, ఎంపీలు..  మంచి ఉదాహరణలుగా నిలవాలన్నారు. పేద ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఇది మంచి మార్గమన్నారు. ఇటువంటి చర్యలు మనిషిలోని వినయాన్ని చూపిస్తాయన్నారు. ప్రజల శక్తిని ధృవీకరిస్తుందన్నారు. 

 

మ‌రోవైపు, కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ(ఎన్పీఆర్)పై స్టే విధించాలని మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ఒవైసీ డిమాండ్చేశారు. ఎన్పీఆర్, -ఎన్ఆర్సీ, -సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ముస్లిం నేత‌ల‌తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చే బిల్లులతో ప్రజల్లో అభద్రత ఏర్పడుతోందని, ముందుగా ఎన్పీఆర్, తర్వాత ఎన్ఆర్సీ, ఆ వెంటనే సీఏఏ అమలు చేయడం వల్ల ఎంతో మంది ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుందని అసద్ అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్అసెంబ్లీలో తీర్మానం చేయడం కాకుండా పూర్తిగా స్టే విధించాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: