సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం సాధారణంగా జరిగేదే. కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం వైసీపీ నేతలే తమలో తాము చిల్లరగాళ్లు అని విమర్శలు చేసుకుంటున్నారు. వైసీపీ శాసన మండలి రద్దు దిశగా అడుగులు వేయడంతో ఎమ్మెల్సీ పదవులు ఆశించిన నేతల్లో ఫ్రస్టేషన్ కనిపిస్తోంది. బహిరంగంగా నేతలు చెప్పుకోలేకపోతున్నప్పటికీ కొందరు తమ కోపాన్ని సొంత పార్టీ కార్యకర్తలపై, నేతలపై చూపిస్తున్నారు. 
 
2019 ఎన్నికల్లో హిందూపురం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఇక్బాల్ అహ్మద్ టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ చేతిలో ఓటమిపాలయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం సొంత పార్టీ నేతలే ఓటమికి కారణమయ్యారని విమర్శలు చేశారు. తాజాగా పార్టీలో ఉన్న విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. రెండు గ్రూపులుగా విడిపోయి ఎమ్మెల్సీ ఇక్బాల్, ఎంపీ నవీన్ నిశ్చల్ పోటాపోటీగా సమావేశాలు నిర్వహించారు. 
 
గురువారం రోజున ఎమ్మెల్సీ వైసీపీ నాయకుడిపై దాడి చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఆ తరువాత జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ 2019లో వైసీపీ హిందూపురం అసెంబ్లీ టికెట్ ను గజినీకి ఇచ్చారని , అయినా పార్టీ కోసం కష్టపడి పని చేశామని చెప్పారు. ఎమ్మెల్సీ సొంత పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని.. ఆయన హిందూపురానికి పట్టిన కరోనా వైరస్ అని విమర్శలు చేశారు. 
 
ఆ విమర్శలకు ఇక్బాల్ స్పందిస్తూ "గతంలో వైయస్ జగన్ ను, షర్మిలను బూతులు తిట్టినోళ్లు... చిల్లరగాళ్లు ఇప్పుడు పార్టీని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు" అని అన్నారు. వైసీపీలో ఇతర నియోజకవర్గాల్లో కూడా చిల్లరగాళ్ల వలన ఇబ్బందులు పడుతున్న నేతలు ఎందరో ఉన్నారు. గతంలో పార్టీపై, పార్టీ అధినేతపై విమర్శలు చేసిన వారు ఇప్పుడు పెత్తనం చలాయించటం కొందరు నేతలకు నచ్చటం లేదు. సాక్షాత్తూ కొందరు వైసీపీ మంత్రులపై కూడా ఈ తరహా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చిల్లరగాళ్ల వ్యవహారం వల్ల వైసీపీకి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ నేతలే చెబుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: