తిరుపతి వెంకన్న.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడని పేరు. వడ్డీకాసులవాడి భక్తులు సమర్పించే కానుకలూ ఎక్కువే. అందరి కోరికలూ తీరుస్తాడని కాబోలు.. భక్తులు కూడా తమ శక్తి కొలదీ కానుకలు సమర్పించుకుంటారు. రోజూ హుండీలో కోట్ల రూపాయలు సొమ్ము జమవుతుంటుంది. మరి ఒక ఏడాదిలో వెంకన్న హుండీ ఆదాయం ఎంతో తెలుసా..

 

 

అక్షరాలా ఒక వెయ్యి.. 351 కోట్ల రూపాయలు.. అవును ఇవి కాకి లెక్కలు కాదు. సాక్షాత్తూ టీటీడీ చెబుతున్న లెక్కలు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం 2020-21 ఆర్థిక సంవత్సరానికి... 3వేల 309కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బడ్జెట్ ఆమోదించింది. ఆదాయాల పెంపు, ఖర్చుల తగ్గింపుపై దృష్టి సారించిన పాలకమండలి తదనుగుణంగా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది.

 

 

ఈ బడ్జెట్ లో ఒక వేయి 351 కోట్ల రూపాయలు శ్రీవారి హుండీ ద్వారా ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా వేసింది. టీటీడీ ధర్మకర్తలమండలి సమావేశంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌కు ఆమోద ముద్ర పడింది. తిరుమల అన్నమయ్య భవన్ లో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో... 3వేల 309 కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ ను ఆమోదించారు.

 

 

గతేడాది పోలిస్తే 67 కోట్ల రూపాయల అధిక అంచనాతో రూపొందించారు. బడ్జెట్‌లో యాత్రికుల వసతి సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యమిచ్చి. అభివృద్ధి పనులకు 300కోట్ల రూపాయలు కేటాయించింది. ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు 207కోట్లు, టీటీడీ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలకు 142 కోట్ల రూపాయలు కేటాయించారు.

 

 

గరుడ వారధి నిర్మాణంలో ప్రాజెక్ట్ రూపకల్పనపై స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ నుంచి స్పష్టత కోరిన పాలకమండలి బడ్జెట్ లో 50కోట్ల రూపాయలను కేటాయించింది. తిరుమల బూందిపోటులో తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాల నివారణకు 3కోట్ల 30లక్షల రూపాయలతో థర్మో ఫ్లూయిడ్ స్టవ్ ఏర్పాటుకు టీటీడీ అంగీకారం తెలిపింది. సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఇన్ఫోసిస్ సహకారంతో ప్రత్యేకంగా సైబర్ క్రైం విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: