ఏపీ సీఎం జగన్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నిన్న కలిసిన విషయం తెలిసిందే. జగన్ సీఎం అయ్యాక తొలిసారి వీరిద్దరూ కలవడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ముఖేష్ కు సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఏపీలో వైసీపీ అధికారంలో ఉండటం, వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అంబానీ జగన్ ను కలిశారు. 
 
జగన్ అంబానీ మధ్య ఏపీలో పెట్టుబడుల గురించి చర్చ జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ భేటీ వెనుక అసలు కారణం మాత్రం మరొకటి ఉందని తెలుస్తోంది. నిన్న జగన్ ను ముఖేష్ అంబానీతో పాటు ఆయన కొడుకు అనంత్, రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ కలిశారు. 2008 నుంచి రెండుసార్లు నత్వానీ రాజ్యసభకు ఎన్నిక కాగా ఏపీ తరపున అతనికి మరోసారి అవకాశం ఇవ్వాలని అంబానీ జగన్ ను కోరినట్టు సమాచారం. 
 
కొన్ని రోజుల క్రితం సీఎం జగన్ ఢిల్లీలో అమిత్ షా, మోదీని కలిసిన విషయం విదితమే. షా జగన్ భేటీలో బీజేపీ వైసీపీ నుంచి ఒక రాజ్యసభ సీటును కోరిందని ప్రచారం జరిగింది. నత్వానీకి ఆ సీటును కేటాయించాలని బీజేపీ కోరిందని జగన్ అందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. అందువలనే అంబానీ నత్వానీతో కలిసి వచ్చి జగన్ ను కలిశారని ప్రచారం జరుగుతోంది. 
 
పరిమళ్ నత్వానీ అంబానీకు సన్నిహితుడు. 1997లో రిలయన్స్ గ్రూప్ లో చేరిన నత్వానీ ఆ తరువాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లో గ్రూప్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక సభ్యులలో నత్వానీ కూడా ఒకరు. బీజేపీతో నత్వానీకి సత్సంబంధాలు ఉన్నాయి. 2008లో జార్ఖండ్ నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన నత్వానీ 2014లో మరోసారి ఎన్నికయ్యారు. వైసీపీ వర్గాలు మాత్రం వైసీపీ నుండి రాజ్యసభ సభ్యునిగా నత్వానీని ఎంపిక చేయాలనే ప్రతిపాదనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ నుండి రాజ్యసభ సీట్లు ఆశిస్తున్న నేతలు ఈ భేటీ గురించి టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: