కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ గత కొంతకాలంగా ఒకదానిపై మరొకటి విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సీఏఏ, ఎన్నార్సీ విషయంలో సీఎం మమతా బెనర్జీ మోదీ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో మమతా ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు. గత రెండు రోజులుగా టీఎంసీ పార్టీ తరపున పీకేను రాజ్యసభకు పంపుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. 
 
టీఎంసీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న నలుగురి పదవీకాలం ఏప్రిల్ 1తో ముగియనుంది. వీరితో పాటు సీపీఐకు చెందిన మరో నేత కూడా రాజీనామా చేయనున్నారు. మార్చి 26వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఒక రాజ్యసభ సీటును ప్రశాంత్ కిషోర్ కు కేటాయించినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. మమత రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా పీకే అంగీకరించలేదని సమాచారం. రాజకీయాలకు తాను కొంతకాలం దూరంగా ఉంటానని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు తెలుస్తోంది. 
 
త్వరలో బీహార్ లోని అన్ని జిల్లాల్లో పీకే పర్యటించనున్నారని సమాచారం. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో నితీష్ తో విబేధించిన పీకేను జేడీయూ ఉపాధ్యక్ష పదవి నుండి తొలగించి పార్టీ నుండి బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే రాజ్యసభ పదవిని ఆఫర్ చేసినా పీకే అంగీకరించకపోవడానికి ముఖ్యమైన కారణమే ఉందని తెలుస్తోంది. గతంలో జేడీయూలో తప్పు జరిగిందని ఆ తప్పు పునరావృతం కావడం ఇష్టం లేదని పీకే చెప్పినట్టు సమాచారం. 
 
రాష్ట్రవ్యాప్తంగా పర్యటన ద్వారా బలమైన రాజకీయ పునాదిని నిర్మించుకోవాలని పీకే భావిస్తున్నారు. ఐదు నుండి పదేళ్లు రాజకీయంగా బలమైన పునాది కోసం కేటాయించాలని నిర్ణయం తీసుకొని పీకే దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించారని తెలుస్తోంది. పదేళ్ల తరువాత ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొనిరావాలని కృత నిశ్చయంతో పీకే ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: