ఆహ్లాదంగా గడిపే  సండే రోజు అదిరిపోయే షాక్ లాంటి వార్త‌. ఇటు ఎండ‌లు..అదే స‌మ‌యంలో ఊహించ‌ని షాకులు త్వ‌ర‌లో ఎదుర్కోవ‌డం ఖాయ‌మే. ప‌ర్యావ‌ర‌ణ మార్పుల గురించి మ‌నం ఎంతో వింటాం. తెలుసుకుంటుంటాం. కానీ ప‌ట్టించుకోకుండా మ‌న నాశ‌నం మ‌నం కొనితెచ్చుకుంటుంటాం. ఇప్పుడు అంత లోతైన చ‌ర్చ కంటే..జేబు ఖాళీ అయ్యే వార్త ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. అదేంటంటే..పాల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయ‌ట‌.

 

 

రేటింగ్స్‌, రిసెర్చ్‌ ఏజెన్సీ క్రిసిల్ మ‌న దేశంలోని ప‌రిస్థితుల గురించి ఆస‌క్తిక‌రంగా వివ‌రించింది. గడిచిన 9 నెలలకు పైగా కాలంలో దేశవ్యాప్తంగా లీటర్‌ పాల ధర రూ.4-5 పెరిగింది. తొలుత పాల ధరలను అముల్‌, మదర్‌ డైరీలు పెంచగా, మిగతా సంస్థలూ అదే బాట పట్టాయి. మార్కెట్‌లో క్రమేణా పెరుగుతూపోతున్న పాల ధరలకు కారణం ఉత్తరాది రాష్ట్రాల్లోని పరిస్థితులేన‌ట‌. గతేడాది వేసవి కాలంలో ఎండిపోయిన జల వనరులు, ఆ తర్వాతి వర్షాకాలంలో సంభవించిన వరదలు.. డైరీ పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేశాయి. నీరు, గడ్డి కొరతలతో పాల ఉత్పత్తి క్షీణించిందని పాల వ్యాపారులు చెప్తున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలతో అడుగంటిన భూగర్భ జలాలు పశువులకు నీటి ఎద్దడిని సృష్టించగా, ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలతో పంట పొలాలు, పచ్చిక బైళ్లు నీట మునిగి గడ్డి లభించకుండా పోయిందని తేలింది.

 

మొక్కజొన్న, చెరకు పంటలు పూర్తిగా దెబ్బతినడంతో పశువులకు గడ్డి లేకుండా పోయిందని, పాల ఉత్పత్తిని ఇది పెద్ద ఎత్తునే కుంగదీసిందని డైరీ యాజమాన్యాలు పేర్కొన్నాయి. అననుకూల వాతావరణ పరిస్థితులు పశువుల ఆరోగ్యంపైనా ప్రభావం చూపాయని క్రిసిల్‌ తెలిపింది. రాబోయే ఎండా కాలంలో పాల ధరలు మరింతగా పెరుగడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నీటి కొరత, పశువులకు ఆహార సమస్య.. ఉత్పత్తిని ఇంకా తగ్గించే వీలుందని, పెరిగే డిమాండ్‌తో ధరలు విజృంభిస్తాయని రాహుల్‌ హెచ్చరించారు. ఈ పరిస్థితులు ద్రవ్యోల్బణానికి దారితీస్తాయన్న అంచనాలూ వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: