పవన్ కళ్యాణ్ సినిమాల్లో మళ్ళీ బిజీగా ఉన్నారు. ఆయన రెండేళ్ళ పాటు విరామం ప్రకటించిన తరువాత వరసగా రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు. దాంతో పవన్ ట్విట్టర్ కూడా బోసిపోయినట్లుగా ఉంది. అపుడపుడు  చిన్న చిన్న ప్రకటనలు  తప్ప పవన్ నుంచి చడీ చప్పుడూ లేదు. మరో వైపు ఏపీలో రాజకీయ  పరిణామాలు వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయాయి. ఢీ అంటే ఢీ అన్నట్లుగా పరిస్థితి ఉంది.

 

విశాఖ వెళ్ళిన చంద్రబాబుని ఎయిర్ పోర్టు నుంచే గో బ్యాక్ అంటూ ప్రజా సంఘాలు, వైసీపీ కార్యకర్తలు కలసి పంపించేశారు. విశాఖలో రాజధాని ఎందుకు అన్నందుకే ప్రజలు  ఇలా చేశారని వైసీపీ  నేతలు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో పవన్ కూడా అమరావతి నినాదం అందుకున్న వారే. దాంతో ఆయన ఉత్తరాంధ్ర రావడం లేదని టాక్ నడుస్తోంది.

 

విశాఖలో మార్చి 2  నుంచి 4 వరకూ మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జనసేన నేతల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు పవన్ బదులు ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ వస్తున్నారు. నిజానికి మనోహర్ పవన్ పక్కన ఉంటే ఆయన ప్రసంగం వింటారు. మరి ఆయన ఒక్కరే  వస్తున్నారు, పవన్ రారు అంటే జనసైనికులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

పవన్ రాకపోవడానికి సినిమా షూటింగులు ఒక కారణమైతే నిన్నగాక మొన్న  చంద్రబాబు విశాఖ వెళ్ళి రచ్చ రచ్చ  చేసుకుని వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, బలమైన పార్టీ నాయకుడు బాబుకే ఇబ్బందులు తప్పలేదు, పవన్ వస్తే విశాఖ జనం ఊరుకుంటారా అన్న డౌట్లు కూడా ఉన్నాయని అంటున్నారు.

 

ఇక  కర్నూల్లో ఇప్పటికే జనసేనానికి చేదు అనుభవం ఎదురైంది. దాంతో విశాఖ రాజధాని వద్దు అన్నందుకు జనాలు పెద్ద ఎత్తున పోగై నిలదీస్తే ఇరకాటంలో పడతామని జనసైనికులు ఆలోచించారని, అందుకే పవన్ రావడం లేదని అంటున్నారు. మొత్తానికి పవన్ ఓడిపోయిన తరువాత ఉత్తరాంధ్రాకు బాగానే ముఖం చాటేస్తున్నారని అంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: