ఢిల్లీ చాంద్‌బాగ్‌లో అల్లర్లు, విధ్వంసానికి కారణమెవరంటే... ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత తాహిర్‌ హుస్సేన్‌ పేరే వినిపిస్తోంది. అయితే... ఐదు రోజులుగా అతని కోసం గాలిస్తున్నా ఇంత వరకూ పట్టుకోలేకపోయారు పోలీసులు. దీంతో ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. 

 

ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అర్లర్లను చూసి దేశం నివ్వెరపోయింది. ముందు ఇదంతా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ గానే అంతా భావించారు. కానీ... ఒకొక్కటిగా వెలుగు చేస్తున్న వాస్తవాలు నివ్వెరపరుస్తున్నాయి. రెండు వర్గాలను పరస్పర దాడులకు ప్రేరేపించి... ఘర్షణల ముసుగులో విధ్వంసం, హత్యలు చేసేందుకు భారీ కుట్ర జరిగినట్టు ఇప్పటికే తేలింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్పొరేటర్‌ తాహిర్ హుస్సేనే ఈ కుట్రకు సూత్రధారి అని తేలడంతో అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. 

 

హింస, విధ్వంసానికి పథక రచన చేసిన తాహిర్ హుస్సేన్... తన ఇంటినే ఓ ఆయుధగారంగా మార్చేశాడు. అతని ఇంటిని అనువణువూ గాలించిన పోలీసుల బృందం కీలక సాక్ష్యాలను సేకరించింది. అలాగే ఐబీ అధికారి అంకిత శర్మ మృతదేహం లభించిన మురుగు కాలువ వద్ద ఫోరెన్సిక్ నిపుణులకు కీలక ఆధారాలు లభించాయి.  

 

ఐదు రోజులుగా తాహిర్ హుస్సేన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే... ఇంత వరకూ అతన్ని పట్టుకోలేకపోవడంతో పోలీసులపై ఒత్తిడి పెరుతోంది. దీంతో అతను ఎక్కడున్నా పట్టుకుంటామని... పక్కా సాక్ష్యాధారాలతో దోషిగా రుజువు చేస్తామంటున్నారు పోలీసులు. 

 

మరోవైపు... అల్లర్లు చెలరేగడానికి ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో తాహిర్ హుస్సేన్ పలు సార్లు మాట్లాడాడనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం తాహిర్ హుస్సేన్ కే పరిమితమౌతుందా, లేక ఆమ్‌ ఆద్మీ నేతల మెడకు కూడా చుట్టుకుంటుందా అనేది దర్యాప్తులో తేలనుంది. 

 

ఢిల్లీలో అల్లకల్లోలం సృష్టించి.. పదుల సంఖ్యలో మృతికి కారణమైన వాడిని ఇంకా పట్టుకోకుండా ఏం చేస్తున్నారని ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎలాగైనా ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్ ను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: