కరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు భారీగా పడిపోయాయి. కానీ భారత్‌లో మాత్రం తగ్గిన రేట్లు వినియోగదారుడికి ఏ మాత్రం ఊరట కలిగించడం లేదు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పడిపోయినప్పటికీ....ట్యాక్స్ ల రూపంలో ప్రజల జేబుకు చిల్లు తప్పడం లేదు. 

 

కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచ మార్కెట్లు షేక్ అవుతుండటంతో...ఆ ప్రభావం క్రూడ్ ధరలపై కూడా పడింది. దీంతో ప్రపంచ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నాయి. కానీ భారత్‌లో మాత్రం ఎలాంటి తగ్గింపు ఉండటం లేదు. తూ.తూ మంత్రంగా కేవలం నాలుగు, ఐదు పైసలు తగ్గిస్తూ వస్తున్నాయి ఆయిల్ సంస్థలు. కరోనా ప్రభావంతో గత నెల రోజులుగా క్రూడ్ ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. కానీ వినియోగదారుడికి కలిగిన ఊరట చాలా తక్కువ.

 

2014 లో మోడీ అధికారంలోకి వచ్చినపుడు బ్యారెల్‌ చమురు ధర 110 డాలర్లకు పైనే ఉండేది. కానీ ప్రస్తుతం 45 డాలర్లకు పడిపోయింది. అంటే నాడు ఉన్న పెట్రో ఉత్పత్తుల ధరల్లో ప్రస్తుతం మూడో వంతు తగ్గాల్సింది. కానీ ప్రస్తుతం వినియోగదారుడు లీటర్ పెట్రోల్‌ను 2014లో ఉన్న రేటుకే కొంటున్నాడు.  మరి క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుదల ప్రభావం వినియోగదారులకు చేరకుండా ఎటు పోయిందనే అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

 

తగ్గిన ధరల ఫలితాలు ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాల్లోకి చేరుతున్నాయి. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం కేవలం వినియోగదారుడికి వచ్చే లాభంలో మాత్రమే ఉండదు. ఆ ఎఫెక్ట్ తో నిత్యావసరాలతో పాటూ చాలా వస్తువులపై మార్పులు జరుగుతాయి. కానీ ఆ దిశగా ఏ ప్రభుత్వం ఆలోచించడం లేదు. చమురుపై విధించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే చూస్తోంది.  దీంతో వినియోగదారుడే నష్టపోతున్నాడు.

 

తాము విధిస్తున్న పన్నులను కేంద్రం సమర్ధించుకుంటోంది. కరెన్సీలో హెచ్చు తగ్గుల కారణంగానే క్రూడ్ ధరలకు అనుగుణంగా మార్పులు చేయలేకపోతున్నామంటున్నారు అధికారులు. అయితే 2014 ఏప్రిల్‌ నుంచి ఇప్పటికి డాలర్‌తో రూపాయి విలువ 20శాతం క్షీణించింది . అంటే 114 డాలర్లలో 20 శాతం తగ్గిస్తే...... కంపెనీలకు ముడి చమురు ధర సగానికి తగ్గుతుంది.

 

పన్ను భారత తగ్గించుకోవడానికి రకరకాల సేవింగ్స్ చేయడానికి బదులు బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని దీన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి సమర్ధించుకున్నారు. కానీ ఇదే సూత్రాన్ని పెట్రోల్ ఉత్పత్తుల ధరల తగ్గింపులో మాత్రం పాటించడం లేదు. క్రూడ్ ధరలకు అనుగుణంగా పెట్రో ఉత్పత్తుల ధరలను మార్పు చేస్తూ పోతే....వినియోగదారులకు సేవింగ్స్ పెరుగుతాయి. తద్వారా వాటిని ఇతర రంగాల్లో ఖర్చు చేయడం వల్ల కూడా కొనుగోలు శక్తి పెరుగుతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు జనం. 

మరింత సమాచారం తెలుసుకోండి: