ఏపీ సీఎం జ‌గ‌న్‌కు త్వ‌ర‌లోనే కేంద్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు అందించ‌నుందా? జ‌గ‌న్ రాజ‌కీయంగా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న శాస‌న మండ‌లి ర‌ద్దుపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించ‌నుందా? త‌్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఈ విష‌యాన్ని బిల్లు రూపంలో ప్ర‌వేశ పెట్టేందుకు వ‌డివ‌డిగా అడుగులు వేస్తోందా? అంటే.. ఢిల్లీ వ‌ర్గాలు ఔన‌నే అంటున్నారు. అదేస‌మ‌యంలో జాతీయ మీడియా కూడా ఆదివారం ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. కేంద్రం విష‌యంలో జ‌గ‌న్ అనేక విష‌యాల్లో సానుకూలంగా ఉండ‌డం, ముఖ్యంగా త‌న‌కు ఈ ద‌ఫా ద‌క్కే రాజ్య‌స‌భ సీట్ల‌లో ఒక దానిని కేంద్రం సూచించిన వారికి ఇచ్చేందుకు ఆయ‌న రెడీ కావ‌డం వంటి ప‌రిణామాలు జ‌గ‌న్ ఆశ‌ల‌ను తీరుస్తున్నాయ‌ని జాతీయ మీడియా పేర్కొంది.



అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ బిల్లు, సీఆర్‌డీఏ ర‌ద్దు బిల్లుల‌ను అసెంబ్లీ ఆమోదించినా.. శాస‌న మండ‌లిలో భారీ బ‌ల‌గంఉన్న టీడీపీ ఈ బిల్లుల‌ను అడ్డుకుంది. ఈ బిల్లుల‌ను త‌న విచ‌క్ష‌ణ అధికారంతో సెల‌క్ట్ క‌మిటీకి పంపుతున్న‌ట్టు మండ‌లి చైర్మ‌న్ ప్ర‌క‌టించారు. దీంతో ఈ వివాదం తీవ్ర‌స్థాయిలో న‌డిచింది. ఈ క్ర‌మంలోనే అస‌లు మండ‌లి ఎందుకంటూ.. సీఎం జ‌గ‌న్ దీనిని ర‌ద్దు చేయాల‌ని ప్ర‌తిపాదించారు.



దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆమోదించుకుని, దీనికి ముందు కేబినెట్‌లోనూ ఆమోదం పొంది..కేంద్రానికి పంపారు. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ దీనికి ఆమోదం ల‌భించి రాష్ట్రప‌తి సంత‌కం చేకూరితే ఏపీలో మండ‌లి ర‌ద్ద‌వుతుంది. అయితే, ఇది అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాద‌ని, క‌నీసం రెండు నుంచి మూడేళ్ల‌యినా స‌మ‌యం ప‌డుతుంద‌ని ప్ర‌తిప‌క్షం టీడీపీ భావించింది. పైగా వ‌చ్చే 2021 నాటికి మండ‌లిలో వైసీపీకే బ‌లం పెరుగుతుంద‌ని కాబ‌ట్టి జ‌గ‌న్ నిర్ణ‌యం కొండ‌నాలుక‌కు మందేసిన‌ట్టుగా ఉంద‌ని ఎద్దేవా చేసింది. అయితే, జ‌గ‌న్ మాత్రం అత్యంత త్వ‌ర‌లోనే మండ‌లి ర‌ద్దు కావ‌ల‌నే నిర్ణ‌యంతో త‌న స్థాయిలో ఈ విష‌యంపై కేంద్రంపై ఒత్తిడి పెంచారు.



ఢిల్లీ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు కేంద్రంతో వైసీపీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి ట‌చ్‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ కూడా కొన్ని రోజుల కింద‌ట ఢిల్లీ వెళ్లి.. మండ‌లి ర‌ద్దు పై అభ్య‌ర్థించారు. దీనిని ప‌రిశీలించిన కేంద్రం.. మండ‌లి ర‌ద్దుతో త‌మ‌కు వ‌చ్చే న‌ష్టం లేద‌ని భావించి.. త్వ‌ర‌లోనే బిల్లు ప్ర‌వేశ పెట్టాల‌ని, పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ ఆమోదం కూడా పొందేలా వ్యూహ ర‌చ‌న చేస్తున్న‌ట్టు తాజాగా వార్త‌లురావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: