ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డితో భార‌తీయ వ్యాపార దిగ్గ‌జం, రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ స‌మావేశం అయిన సంగ‌తి తెలిసిందే. దీనిపై విప‌క్షాలు వివిధ ర‌కాల విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే, ప్ర‌తిప‌క్షాల కామెంట్లపై వైసీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు ఘాటుగా స్పందించారు.

 

దేశంలోనే నంబర్‌వన్‌ పారిశ్రామికవేత్తగా పేరుపొందిన ముఖేష్‌ అంబానీ, ఆయన పుత్రుడు అనంత్  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో సమావేశమై పెట్టుబడుల గురించి చర్చించారని అంబటి రాంబాబు వెల్ల‌డించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్దికి, విద్య, వైద్య రంగాలలో పెట్టుబడులు పెడతామని వారు ముందుకు వచ్చారని వెల్ల‌డించారు. ముఖేష్‌  అంబానీతో జరిగిన చర్చలు రాష్ట్రానికి శుభ సూచకం అయితే చంద్రబాబు కువిమర్శలు చేస్తున్నారని అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు. ``రాష్ట్రం నుంచి భారీ పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలి పోతున్నాయని, చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. కియా పరిశ్రమ కూడా వెళ్లిపోతోందని తప్పుడు వార్తలు రాయించారు. పారిశ్రామిక రంగంలో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు.`` అని మండిప‌డ్డారు.


ముఖ్యమంత్రిగా జగన్‌ కొనసాగడం వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి పోతున్నాయని, తాను గనక ఉండే పెట్టుబడిదారులు రాష్ట్రానికి క్యూ కట్టేవారని చంద్రబాబు చెబుతున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ``పరిశ్రమల కోసం పెట్టుబడిదారులను స్వాగతిస్తోన్న ముఖ్యమంత్రి ఆ దిశగా అనేక చర్యలు తీసుకుంటుంటే....ముఖేష్‌ అంబానీతో చర్చలెందుకు?  చర్చల సారాంశం ఏమిటి? టీ ఎందుకిచ్చారు? శాలువ ఎందుకు కప్పారు? అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మా ప్రభుత్వంపై విషాన్ని కక్కుతున్నారు. అంబానీ సన్నిహతుడికి రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలని తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు మరుగున పడేందుకు బూటకపు మాటలు మాట్లాడుతున్నారు. అవాకులు చెవాకులు పేలుతున్నారు. విధ్వంసాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలను రగిలిస్తున్నారు. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. `` అంటూ చంద్ర‌బాబు వైఖ‌రిని అంబ‌టి ఎండ‌గ‌ట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: