రాబోయే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుదీర్ఘంగా సమీక్ష చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో...తెలంగాణ సీఎం వివిధ అంశాల‌పై స్పష్ట‌త ఇస్తున్నారు. ఒక్కోరోజు ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు అధికారులతో చర్చించిన సంద‌ర్భాలు సైతం ఉన్నాయి.  దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అవలంబించాల్సిన ఆర్థిక విధానంపై లోతుగా చర్చించారని స‌మాచారం.

 

ఆర్థిక శాఖ మంత్రి టి. హరీశ్‌ రావు, మున్సిపల్‌ శాఖ మంత్రి కెటి రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామక ష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్‌ రాస్‌, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌ రావు, ఆర్థిక శాఖ సలహాదారు జిఆర్‌ రెడ్డి త‌దిత‌రుల‌తో రాబోయే  బడ్జెట్లో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి? ఏ రంగాలకు ఎంత కేటాయింపులు జరపాలి? ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటి? స్వీయ ఆదాయం పెంచుకునే మార్గాలేమిటి? తదితర అంశాలపై కసరత్తు చేశారు. కేంద్రం నుంచి ఆర్థిక స‌హాయం లేని త‌రుణంలో రాష్ట్రానికి సానుకూలంగా ఉన్న అంశాల‌పై ఫోక‌స్ చేసిన‌ట్లు స‌మాచారం.

 


దేశ ఆర్థిక వృద్ధి రేటు నానాటికీ దిగజారుతున్నప్పటికీ తెలంగాణలో వృద్ధి రేటు ఈసారి కూడా నిలకడగానే ఉన్నది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికూల పరిస్థితులను, ఆర్థిక మాంద్యాన్ని అధిగమించి సుస్థిర అబివృద్ధిని సాధిస్తున్న తెలంగాణ ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇతర రాష్ట్రాల‌ కంటే వేగంగా ముందుకు సాగుతూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. రాష్ట్ర రవాణా రంగంలో వృద్ధిరేటు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మిగిలిన రంగాల్లో తెలంగాణ గణనీయ వృద్ధిని సాధిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సంపద (జీఎస్డీపీ) స్థిర ధరల వద్ద 10.5 శాతం, ప్రస్తుత ధరల వద్ద 14.8 శాతం వృద్ధిని సాధించింది. ఈసారి దేశ జీడీపీ స్థిర ధరల వద్ద 5 శాతంలోపే ఉండగా.. ప్రస్తుత ధరల వద్ద 7.5 శాతంగా ఉన్నది. దీన్ని అధిగమించి తెలంగాణ స్థిర ధరల వద్ద 8 శాతానికిపైగా, ప్రస్తుత ధరల వద్ద 12 శాతానికిపైగా వృద్ధిరేటును సాధించే అవకాశమున్నదని తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.  ఈ నేప‌థ్యంలో వృద్ధి రేటు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ఫ‌లితం ఆశాజ‌న‌కంగానే ఉంటుంద‌ని అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: