హైద‌రాబాద్ మొట్రో రైల్‌ మొదటిదశ విజయవంతంగా ప్రయాణికులను చేరవేస్తున్న నేపథ్యంలో విస్తరణతోపాటు మెట్రో రెండోదశ ప్రాజెక్టుపైన అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విస్తరణ ప్రాజెక్టులతోపాటు కూకట్‌పల్లి మార్గంలో నిర్మించే ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (ఈబీఆర్‌టీఎస్‌) ప్రాజెక్టులను పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో నిర్మించనున్నారు. రాయ్‌దుర్గ్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌, ఇతర మార్గాల్లో ప్రతిపాదిత మెట్రో ప్రాజెక్టులను పీపీపీ విధానంలో నిర్మించాలని భావిస్తున్నారు. ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ బిల్డ్‌ఆపరేట్‌ (బీవోటీ) పద్ధతిలో నిర్మించడం ద్వారా ప్రభుత్వంపై భారం పడకుండా ప్రయాణ సౌకర్యం అందించవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ వే మార్గంలో 31 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించేందుకు హైదరాబాద్‌ మెట్రో నిర్మించిన ఎల్‌అండ్‌టీ ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. 

 

అయితే, ఇప్ప‌టికే సేవ‌లు అందుతున్న మెట్రోపై కేంద్రానికి ఫిర్యాదు అందిన‌ట్లు తెలుస్తోంది. జీవోలు, అగ్రిమెంట్‌లకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా మెట్రో రైలు టికెట్‌ చార్జీలను ఎలా నిర్ణయిస్తారని, ఎవర్నడిగి టికెట్‌ ధరలు పెంచారని సీపీఎం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. చార్జీల పెంపుకు ప్రభుత్వ అనుమతి ఉందా? లేదా? ఎల్‌అండ్‌టీ సంస్థ సమాధానం చెప్పాలని, టికెట్‌ చార్జీలపై పట్ణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించాలని డిమాండ్‌ చేసింది. చట్టవిరుద్ధంగా మెట్రోలో టికెట్‌ ధరలు వసూలు చేస్తున్నారని, తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బేగంపేటలోని హైదరాబాద్‌ మెట్రోరైల్‌ భవన్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. 2010లో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిధులు, భూములు తీసుకున్న ఎల్ అండ్ టీ సంస్థ.. టికెట్‌ ధరలను మాత్రం కేంద్ర మెట్రో రైలు చట్టం ప్రకారం వసూలు చేయడం చట్టవిరుద్ధమని అన్నారు. 

 

గ‌తంలో కుదిరిన ఒప్పందం ప్రకారం కనీస చార్జీ రూ.8, గరిష్ట చార్జీ రూ.19 వసూలు చేయాల్సిందిపోయి.. ఇష్టానుసారంగా వసూలు చేస్తోందని, ఎవరి అనుమతితో చార్జీలు పెంచారో ఎల్‌అండ్‌టీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జీవో 127 అమలులో ఉందా? లేదా చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం మెట్రోలో వసూలు చేస్తున్న రేట్లతో సామాన్యులు ప్రయాణం చేయలేరన్నారు. అందుకే 2019 నాటికి మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య 19 లక్షలకు చేరాల్సి ఉండగా.. నాలుగు లక్షల వద్దే ఉందన్నారు. ఎల్‌అండ్‌టీ అగ్రిమెంట్‌ రాసిన మాజీ సెంట్రల్‌ ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యులు గజేంద్ర హాల్దియా సైతం మెట్రో చార్జీలు పెంచడం చట్టవిరుద్ధమని.. కేంద్రానికి సైతం ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మెట్రో చార్జీలు, ఎల్‌అండ్‌టీ లేబర్‌ సెస్‌ కింద కార్మికశాఖకు చెల్లించాల్సిన రూ.164 కోట్లపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఎల్‌అండ్‌టీ సంస్థపై లీగల్‌గా ముందుకు వెళ్తామన్నారు. కాగా ధ‌ర్నా అనంతరం హెచ్‌ఎంఆర్‌ఎల్‌ జీఎం(ఫైనాన్స్‌) సూర్యప్రకాశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మెట్రో టికెట్‌ ధరల పెంపుపై వివ‌ర‌ణ ఇస్తూ  2010 ఒప్పందంతో అవసరం లేదని, సెంట్రల్‌ మెట్రో చట్టం ప్రకారం చార్జీలు పెంచామని చెప్పారని వామ‌ప‌క్ష నేత‌లు మీడియాకు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: