నిర్భయ అత్యాచారం, హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నేడే రేపో ఉరి తీయాల్సిన దోషులు చావు తెలివితేటలు చూపిస్తున్నారు. నాలుగో దోషి పవన్ కుమార్  గుప్తా శిక్షను ఆలస్యం చేసేందుకు క్యూరేటివ్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో తనకు విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని పవన్ కోరుతున్నారు. 

 


ఈ మేరకు పవన్  దాఖలు చేసిన పిటిషన్ పై . జస్టిస్ ఎన్ .వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ కేసుకు సంబంధించి గతంలో క్యూరేటివ్  పిటిషన్లు  రివ్యూ పిటిషన్లను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పక్కన పెట్టాలని కూడా పవన్  తన పిటిషన్ లో అభ్యర్ధించాడు. డెత్ వారెంట్ల అమలుపై స్టే కోరుతూ పవన్ కుమార్ , మరో దోషి అక్షయ్ సింగ్ ఇప్పటికే ట్రయల్ కోర్టును ఆశ్రయించారు.

 


పవన్  పిటిషన్ ను ఒక వేళ సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసినా వీరి పిటిషన్ లపై ట్రయల్  కోర్టులో విచారణ జరగాల్సి ఉన్నందున రేపు ఉరిశిక్ష అమలుపై సందిగ్ధం నెలకొంది. ఇలా నిర్బయ రేపిస్టులు ఎప్పటి కప్పుడు తమ చావు తెలివి తేటలు చూపిస్తూ.. ఉరిశిక్షను వాయిదా వేయించుకుంటున్నారు. వీలైనంత వరకూ ఇలా వరుసగా పిటీషన్లు వేస్తూ తమ జీవిత కాలాన్ని పొడిగించుకుంటున్నారు.   

 


దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్16,2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో చాన్నాళ్ల నిరీక్షణ తర్వాత నలుగురు దోషులకు డెత్ వారంట్ జారీ అయింది. 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగురిలో ఒకడు జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరొకరు మైనర్ కావడంతో జువైనల్ చట్టం ప్రకారం.. మూడేళ్ల శిక్షా కాలం ముగిశాక విడుదల అయ్యాడు. మిగిలిన నలుగురిలో పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ లకు ఉరిశిక్ష విధించాలని ఎప్పటినుంచో నిర్భయ తల్లిదండ్రులు పోరాటం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: