గ‌త కొన్ని రోజులుగా మత ఘర్షణలతో అట్టుడుకిన ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. శుక్రవారం కాస్త కుదుటపడిన ఈ ప్రాంతం.. శనివారం, ఆదివారం కూడా ప్రశాంతంగా ఉంది. ప్రజలు ఇళ్ల‌ నుంచి బయటికి రావడం కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే, ఈ దాడులు, ఇత‌ర‌త్రా అంశాల‌పై మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎంఐఎం 62వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం దారుసలాంలో  నిర్వహించారు.  పథకం ప్రకారమే ఢిల్లీలో అల్లర్లు జరిగాయని మజ్లిస్‌ పార్టీ అధినేత ఆరోపించారు.

 


ఢిల్లీలో చెలరేగినవి మత కలహాలు కావని, బీజేపీ నాయకులు పథకం ప్రకారం విద్వేషాలు రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించారని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన అమానుష ఘటనలకు ప్రధాని నరేంద్రమోదీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ నివాసానికి కూతవేటు దూరంలో జరిగిన అల్లర్లపై ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ప్రధానికి నిజంగా బాధ్యత ఉంటే వెంటనే అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని సవాల్‌ విసిరారు. 

 

ఢిల్లీ అల్లర్లలో చనిపోయిన వారంతా భారతీయులేనని ఓవైసీ అన్నారు. గతంలో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల నుంచి మోది పాఠాలు నేర్చుకొని ఉంటారని అనుకున్నాననీ.. కానీ, ఆయనలో ఇసుమంతైనా మార్పు రాలేదని తెలుస్తుందన్నారు. 2020లో ఢిల్లీ మరో మారణహోమానికి వేదికైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్వేశ పూరిత ఉపన్యాసాలు చేస్తున్నానని కేసులు పెట్టినా భయపడనని ఆయన అన్నారు. ఎందుకంటే, తాను మాట్లాడే ప్రతి మాట దేశానికి మంచి చేస్తుందనే ఉద్ధేశ్యంతోనే అని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు త‌న గళం వినిపిస్తానని ఆయన తెలిపారు. ఢిల్లీ బాధితులకు ఎంఐఎం ప్రజాప్రతినిధులమంతా.. ఒక నెల జీతం విరాళంగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

 

ఇదిలాఉండ‌గా, ఢిల్లీలో దుండగులు తగులబెట్టిన జవాన్‌ మహమ్మద్‌ అనీస్‌ ఇంటిని తిరిగి నిర్మిస్తామని బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. ఆయన ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లోని రాధాబరి బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌లో విధులు నిర్వర్తిస్తుండగా, కుటుంబం ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో ఉంటోంది. అనీస్‌కు త్వరలో వివాహం కావాల్సి ఉంది. దాడుల్లో ఆయన ఇల్లు తగలబడిపోయిందన్న విషయం తెలుసుకున్న బీఎస్‌ఎఫ్‌ దాన్ని పునర్ నిర్మించి వివాహ కానుకగా అందజేయాలని నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: