నిర్భయ దోషుల ఉరిశిక్ష విషయంలో పాటియాలా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అక్షయ్ సింగ్  ఉరి శిక్ష పై స్టే విధించాలని కోరగా స్టే విధించే ప్రసక్తే లేదని కోర్టు తేల్చి చెప్పింది. నిర్భయ దోషులు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఉరితీతపై గత కొన్ని నెలలుగా ఉత్కంఠ కొనసాగింది. 
 
అక్షయ్ గత శుక్రవారం మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నాడు. అక్షయ్ కొత్త క్షమాభిక్ష పిటిషన్ వేసినందున ఉరి శిక్షపై స్టే విధించాలని కోర్టును కోరాడు. కోర్టు అక్షయ్ పిటిషన్ ను కొట్టివేసింది. గతంలో అక్షయ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోగా రాష్ట్రపతి పిటిషన్ ను తిరస్కరించారు. ఉరితీతకు ఒకరోజు ముందు మరో నిందితుడు పవన్ గుప్తా రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నాడు. 
 
గతంలో సుప్రీం కోర్టు పవన్ క్యురేటివ్ పిటిషన్ ను కొట్టివేసింది. పటియాలా కోర్టుకు నిర్భయ దోషుల లాయర్ ఏపీ సింగ్ పవన్ తనకున్న చిట్టచివరి అవకాశమైన క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం ఈ అంశంపై న్యాయస్థానం విచారణ జరపనుంది. తీహార్ జైలు అధికారులు నిర్భయ దోషులను రేపు ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కానుంది. 
 
ఇప్పటికే నిర్భయ దోషులు న్యాయపరంగా ఉన్న అవకాశాలను వినియోగించుకున్నారు. ఉరిశిక్షను తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. గతంలో ఉరిశిక్ష ఖరారై శిక్ష వాయిదా పడింది. నిర్భయ కేసు దోషుల అవయవాలను దానం చేయాలంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలు కాగా ఆ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. 2012, డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ లో ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఆత్మహత్యకు పాల్పడగా మరో టీనేజ్ యువకుడు మూడేళ్ల శిక్ష తరువాత విడుదలయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: