ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 3000 దాటింది. తాజాగా ఇండియాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా వైరస్ లక్షణాలతో రెండు కేసులు నమోదైనట్లు ప్రకటన చేసింది. ఈ రెండు కేసుల్లో ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో నమోదు కాగా మరొకటి తెలంగాణలో నమోదైంది. ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్టు కేంద్రం తెలిపింది. 
 
దుబాయి నుండి హైదరాబాద్ వచ్చిన మరో వ్యక్తిలో కూడా కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించామని కేంద్రం తెలిపింది. కేంద్రం వీరిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించి పరిశీలనలో ఉంచింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వీరిద్దరి పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేసింది. కరోనా బారిన పడి చైనాలో 2,912 మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 89 వేలకు చేరింది. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ 60 సంవత్సరాల వయస్సు పై బడిన వారిపై, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా పడుతోందని తెలిపింది. లక్షణాల తీవ్రత తక్కువ స్థాయిలో ఉండటంతో కొంతమందిలో వ్యాధి నిర్ధారణ చేయడం కష్టంగా మారిందని చెప్పింది. కరోనా సోకిన వారిలో మరణాల రేటు 2 నుండి 5 శాతం వరకు ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 
 
అమెరికాలో కారోనా బారిన పడి ఒక వ్యక్తి చనిపోయారు. న్యూయార్క్ లో కరోనా తొలి కేసు నమోదు కాగా అమెరికాలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. చైనా తరువాత అత్యధికంగా కరోనా బాధితులు దక్షిణ కొరియాలో ఉన్నారు. దక్షిణ కొరియాలో బాధితుల సంఖ్య 4,212 కు చేరింది. నిన్న ఒక్కరోజే  476 కొత్త కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య 22కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: