ఏపీ సీఎం జగన్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. హైకోర్టు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ గురించి తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.85 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని తిరస్కరించింది. హైకోర్టులో ఈరోజు ఏపీలో స్థానిక ఎన్నికలపై విచారణ జరిగింది. గతంలో ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించేందుకు జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. హైకోర్టు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా 50 శాతానికి పైగా రిజర్వేషన్లు చెల్లవని స్పష్టం చేసింది. 
 
హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి 50 శాతం రిజర్వేషన్లు దాటవద్దని సూచించింది. బీసీ రిజర్వేషన్లు నెలలోగా ఖరారు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రావడంతో స్థానిక ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నాలుగు వారాల తరువాత ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ఏపీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 59.85 శాతంగా నిర్ణయించడాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. 
 
గతంలోనే హైకోర్టు పిటిషన్లను విచారించి తీర్పు రిజర్వ్ చేసింది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టుకు సుప్రీం కోర్టు గతంలో ఒక కేసు విషయంలో 50 శాతానికి మించి రిజర్వేషను ఉండకూడదని తీర్పు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లను పెంచుకోవచ్చని కోర్టుకు తెలిపారు. ఈరోజు కోర్టు తీర్పును వెలువరించి వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. 
 
 
హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం ఖరారు చేసిన రిజర్వేషన్లు రద్దు కానున్నాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికల విషయంలో ఏ విధంగా ముందుకెళ్లనుందో చూడాల్సి ఉంది.                           

మరింత సమాచారం తెలుసుకోండి: