2014 రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా తయారైందో అందరికీ తెలిసిందే. అప్పటివరకు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీని చాలామంది నాయకులు వదిలేసి వైసీపీ, టీడీపీల్లోకి చేరారు. అయితే కొందరు మాత్రం అలాగే కాంగ్రెస్‌లో ఉన్నారు. కానీ 2014 ఎన్నికల ఫలితాల దెబ్బకు కాంగ్రెస్ మట్టికొట్టుకుపోయింది. దీంతో ఫలితాల తర్వాత చాలామంది టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇక కాంగ్రెస్ భవిష్యత్ కష్టమని భావించి 2019 ఎన్నికల ముందు కొందరు కాంగ్రెస్ నేతలు టీడీపీ, వైసీపీల్లోకి వచ్చారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

 

ఆయన ఆ ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ తరుపున నిలబడి విజయం సాధించారు. అసలు మహీధర్ ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పని చేశారు. అయితే 2019 ఎన్నికల ముందు మహీధర్ వైసీపీలోకి రాగానే జగన్ కందుకూరు టికెట్ ఇచ్చేశారు. 2014లో వైసీపీ తరుపున గెలిచిన పోతుల రామారావు టీడీపీలోకి వెళ్ళి, 2019లో ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. ఇక అనూహ్యంగా మహీధర్ 15 వేల మెజారిటీతో గెలిచేశారు.

 

వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉంటూ, నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. పైకి హైలైట్ కాకపోయిన సైలెంట్‌గా నియోజకవర్గంలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు. వాటిల్లో లోటుపాట్లు ఉంటే సరిదిద్దుతున్నారు. కొత్తగా రోడ్లు నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా ఉన్న నీటిసమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సాయంతో వెలికొండ ప్రాజెక్టు నుంచి రాళ్ళపాడుకు కృష్ణా జలాలు అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీని వల్ల లింగసముద్రం, వలేటివారి పాలెం, గుడ్లూరు మండలాలు సస్యశ్యామలం కానున్నాయి.

 

అటు ఈయన నియోజకవర్గంలోనే ఉన్న రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్రం సిద్ధం కావడం కందుకూరు నియోజకవర్గానికి కలిసిరానుంది. 74 శాతం కేంద్రం, 26 శాతం రాష్ట్రం వాటాతో పోర్టు నిర్మాణం జరగనుంది. ఇక ఈ అంశం మహీధర్‌రెడ్డికి కూడా ప్లస్ అవుతుంది. మొత్తానికైతే కందుకూరులో మాజీ మంత్రి సైలెంట్‌గా పనిచేసుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: