మూడు రాజధానుల ద్వారా ప్రజలను మభ్యపెట్టాలని చూసి భంగపడిన వైసీపీప్రభుత్వం, మహిళాదినోత్సవం సందర్భంగా మూడుప్రాంతాల్లో పవర్ వాక్ పేరుతో మరోసారి ప్రజలను మోసగించే యత్నాలకు శ్రీకారం చుట్టిందని టీడీపీ మహిళానేత, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత మండిపడ్డారు.  జగన్ అధికారంలోకి వచ్చిన 9నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై 172 అత్యాచారాలు, హత్యలు జరిగినట్లు కేసులు నమోదయ్యాయని, వాటిపై మాట్లాడే ధైర్యం మహిళైన రాష్ట్రహోంమంత్రికి, ఇతరమహిళా మంత్రులకు, వైసీపీ మహిళాఎమ్మెల్యేలకు లేకపోవడం సిగ్గుచేటన్నారు. పవర్ వాక్ పేరుతో, వీధుల్లో పరుగులు పెట్టిన వైసీపీ మహిళానేతలంతా, తమపార్టీకి చెందిన కామాంధుల కామవాంఛవల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలవద్దకు ఆ పరుగుని ఎందుకు కొనసాగించలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. 


172 కుటుంబాల్లో ఎంతమందికి న్యాయం చేశారో, ఎంతమంది కామాంధులకు వైసీపీ ప్రభుత్వం శిక్షలు పడేలా చేసిందో సదరు మహిళానేతలే సమాధానం చెప్పాలని అనిత డిమాండ్ చేశారు. వైసీపీ మహిళామణుల వాక్, వాక్కు ... రెండూకూడా రాష్ట్ర మహిళలకు భరోసా కల్పించేవిగా లేకపోగా, తమనాయకుడైన జగన్ ను నెత్తిన పెట్టుకునేలా ఉన్నాయన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న వైసీపీ మహిళానేతలంతా నోళ్లేసుకొని నాటి ప్రభుత్వంపై పడిపోయారని, నేడు అవేనోళ్లు బాధితకుటుంబాలను పరామర్శించడానికి ఎందుకు తెరుచుకోవడంలేదన్నారు. తమబిడ్డలను కోల్పోయి బాధపడుతున్న కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఎలాంటి సాయం చేశారోవైసీపీ మహిళాలోకం సమాధానం చెప్పాలని అనిత డిమాండ్ చేశారు.


ఏ వంకకు వెళ్లాలో తెలియనివాడు డొంకపట్టుకొని ఏడ్చాడన్నట్లుగా ప్రవర్తిస్తున్న వైసీపీ ప్రభుత్వం దిశచట్టం పేరుచెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తోందన్నారు. అమల్లోకి రాని చట్టాన్ని రాష్ట్రంలో తామే అమలుచేస్తున్నట్లు వైసీపీమహిళానేతలు చెప్పుకోవడం, పవర్ వాక్ లు చేయడం చూసి రాష్ట్ర మహిళా లోకమే వారిపై  ఛీ అంటూ ఉమ్ముతోందన్నారు. ప్రాణంలేని చట్టంతో, మహిళలకు రక్షణ కల్పిస్తామని చెబుతున్న అధికారపార్టీ మహిళలు, బాధితులైన 172 మంది గురించి ఏం సమాధానం చెబుతారని అనిత నిలదీశారు. ఒంగోలులో వైసీపీ కార్యకర్త షేక్ బాజీ, బాలికపై 3రోజుల పాటు అత్యాచారం చేస్తే, అతను యథేచ్ఛగా బయటతిరుగుతున్నాడని, అదేవిధంగా ఆడబిడ్డలపై అత్యాచారాలకు పాల్పడిన కరుణాకర్ రెడ్డి, నరేంద్రరెడ్డిల సంగతేంటో చెప్పాలని టీడీపీమహిళానేత డిమాండ్ చేశారు. వైసీపీ కార్యకర్తలు మాట్లాడేభాష, వారు వాడే పదజాలం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారం జగన్ ప్రభుత్వంలోని మహిళానేతలకు కనిపించడంలేదా అని ఆమె ప్రశ్నించారు. 

 

వైసీపీనేతలు, కార్యకర్తలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడొచ్చంటూ, ఎలాగైనా ప్రవర్తించవచ్చునని జగన్ ఏమైనా చెప్పాడా అని అనిత నిలదీశారు. అమరావతి మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన రవీంద్రరెడ్డి అనేవ్యక్తికి దిశచట్టం వర్తించదా అని ఆమె ప్రశ్నించారు. వైసీపీ మహిళల వాక్.. వాక్కు బాధిత కుటుంబాలకు న్యాయం చేయనప్పుడు, మహిళల దినోత్సవం నాడు ఏం చేస్తే మాత్రం, ఏం ఉపయోగం ఉంటుందన్నారు. వైసీపీప్రభుత్వంలో ఖాకీలు కూడా కామాంధుల జాబితాలో ఉన్నారని, రాష్ట్రంలో దిశాచట్టం అమల్లో ఉంటే, వారెందుకు అంతలా బరితెగిస్తారని వంగలపూడి నిలదీశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: