దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో మరోసారి ఉరిశిక్ష వాయిదా పడింది. కోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది. పటియాలా హౌస్ కోర్టులో దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా డెత్ వారంట్ పై స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు పిటిషన్ విచారణకు వచ్చింది. కోర్టు తీహార్ జైలు అధికారులకు డెత్ వారెంట్లు ఇచ్చే వరకు ఉరి నిలుపుదల చేయాలని పేర్కొంది. 
 
కోర్టు కొత్త తేదీలపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అంతకు ముందే పవన్ గుప్తా సుప్రీం కోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీం ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది. దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ పవన్ గుప్తా తరపున మెర్సీ పిటిషన్ వేశారు. కోర్టు రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉండటంతో తదుపరి ఆదేశాలు వెలువడేంతవరకూ దోషులను ఉరి తీయరాదని ఉత్తర్వులు ఇచ్చింది. 
 
నిర్భయ తల్లి ఆశాదేవి కోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలు దోషులకు అనుకూలంగా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలతో నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. ఢిల్లీ కోర్టు పవన్ అభ్యర్థనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. క్షమాభిక్ష, క్యురేటివ్ పిటిషన్లు పెట్టుకోవడానికి ఎందుకు ఆలస్యం చేశారని దోషుల తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. 
 
ఒక వ్యక్తి చేసే తప్పుడు చర్యల వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయో తెలియదా అంటూ కోర్టు న్యాయవాదిని ప్రశ్నించింది. దోషులు తమకు ఉన్న న్యాయ అవకాశాలను ఒకరి తర్వాత ఒకరు వినియోగించుకోవడంతో ఉరిశిక్ష అమలు ఆలస్యమవుతోంది. మూడు సార్లు నిందితులు న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవడం వల్ల ఉరి వాయిదా పడటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: