ఎప్పుడో చంద్రబాబు హయాంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు...ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటుతున్న జరగలేదు. అప్పుడు ఏదో బాబు భయపడి, అనుకూల ఫలితాలు రావని చెప్పి స్థానిక ఎన్నికలని జరిపించకుండా తప్పించుకున్నారు. అలా తప్పించుకున్న ఆయనకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో తెలిసిందే. ఇక భారీ మెజారిటీతో సీఎం పీఠంలో కూర్చున్న జగన్ స్థానిక ఎన్నికలు జరిపించడానికి సిద్ధమై, రిజర్వేషన్లు కూడా ఖరారు చేసుకున్నారు.

 

అయితే ఇక్కడే రిజర్వేషన్ల అంశం కోర్టుకు ఎక్కింది. 59.85 శాతం రిజర్వేషనన్లు వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ పడింది. ఇక ఈ అంశంపై వాయిదాల వాయిదాలు పడి, చివరికి హైకోర్టు 59.85 శాతం రిజర్వేషన్‌ నిర్ణయాన్ని తిరస్కరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ఆదేశించింది. రిజర్వేషన్లు 50శాతం దాటడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఇక నెలలోగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని, 4 వారాల తరువాత ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.

 

ఇక ఈ విధంగా రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి షాక్ ఇచ్చి, స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా పడేలా చేయడం జగన్‌కే కలిసిరానుంది. ప్రభుత్వం మళ్ళీ ఏదొకవిధంగా రిజర్వేషన్లని సెట్ చేసుకుని ఎన్నికల్లోకి దిగుతుంది. కానీ ఎన్నికలు జరగడానికి నెలపైనే పడుతుంది. దాని వల్ల జగన్‌కు అడ్వాంటేజ్ పెరిగి, బాబుకు నష్టం జరగనుంది. మామూలుగా జనవరిలో ఎన్నికలు జరిగి ఉంటే మూడు రాజధానుల నిర్ణయం వల్ల జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో వైసీపీకి ఇబ్బంది వచ్చేది.

 

అయితే ఆ మూడు రాజధానుల సమస్య చాలావరకు తగ్గింది. కాకపోతే ఇటీవల పెన్షన్, రేషన్‌ కార్డులు అర్హత లేని వారికి తొలగించింది. ఇక అర్హత ఉన్నవారికి కూడా కొన్ని చోట్ల పోయాయి. ఇదే సమయంలో లోకల్ బాడీ ఎన్నికలు వచ్చి ఉంటే జగన్‌కు గట్టిగానే దెబ్బ పడేది. అసలు అర్హత లేకపోయిన కార్డులు పోతేనే చాలామంది రచ్చ చేసేశారు. ఇక అర్హత ఉండే పోయిన వారు కూడా అదే స్థాయిలో గగ్గోలు పెట్టారు. దీంతో జగన్ మళ్ళీ వెరిఫికేషన్ చేసి అర్హతలు ఉన్నవారికి రేషన్, పెన్షన్ తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

 

అందుకు తగ్గట్టుగానే అర్హతలు కలిగినవారికి పెన్షన్ రెండు నెలలకి ఇచ్చారు. అటు రేషన్ కార్డుల్లో కూడా సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఈ సమస్య పూర్తిగా తగ్గడానికి ఇంకా కొంచెం టైమ్ పడుతుంది. ఈ సమస్య తగ్గిపోయాకే స్థానిక ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది. పైగా మార్చి 25న పేదలకు ఉచిత ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఇక ఇదంతా స్థానిక ఎన్నికల్లో జగన్‌కు కలిసొస్తుంది. బాబుకు డ్యామేజ్ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: