రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారని, ఆయన ప్రసంగంలో ఎక్కడా కూడా మండలితిరస్కరించిన మూడురాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు అంశాల ప్రస్తావన రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టంచేశారు.  గవర్నర్ ప్రసంగం సమావేశాల్లో భాగం కాకపోయినప్పటికీ, అది జరగడం అనేది రివాజుగా వస్తోంది కాబట్టి, అది జరుగుతుందన్నారు. కానీ గవర్నర్ ప్రసంగాన్ని తయారుచేసేది ప్రభుత్వమే కాబట్టి, దానిలో ఎక్కడా కూడా గత సమావేశాల్లో మండలి తీసుకున్న నిర్ణయాలను ఎక్కడా ఆ ప్రసంగంలో రాకుండా చూడాలన్నారు.  రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిన మండలి, ప్రభుత్వ పాలసీని రూల్-71కింద తిరస్కరించడం జరిగిందన్నారు. 


ఏపాలసీలను మండలి తిరస్కరించిందో, వాటినే గవర్నర్ ప్రసంగంద్వారా ప్రభుత్వం తిరిగి సభల్లోకి తీసుకురావాలని చూస్తోందన్నారు. గవర్నర్ తన ప్రసంగంలో ఎక్కడా తనసొంత అభిప్రాయాలు చెప్పరని, ప్రభుత్వ ఆలోచనలు, అభిప్రాయాలే ఆయనద్వారా సభల ముందుకొస్తాయని యనమల పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదిశగా ప్రయత్నాలుచేయకుండా, నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, గవర్నర్ కూడా తాను చేయబోయే ప్రసంగాన్ని పరిశీలించాలన్నారు.  అసెంబ్లీలో ఆ రెండు బిల్లులు మద్ధుతుపొందాయికాబట్టి, అక్కడ వాటి ప్రస్తావనరాదని, మండలిలో మాత్రమే వాటిని ప్రస్తావించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తు దన్నారు. సర్కారు అదేవిధంగా ముందుకెళ్లాలని చూస్తే, ప్రతిపక్షం చూస్తూ ఉండదని, రాజ్యాంగంప్రకారం, చట్టప్రకారమే ముందుకెళుతుందన్నారు.

 

గతంలో మండలిలో ప్రతిపక్షం తిరస్కరించిన మూడురాజధానుల బిల్లు, సీఆర్డీ ఏ రద్దు బిల్లులను గవర్నర్ ప్రసంగంలో చేరిస్తే, ఆ రెండు అంశాలు సభలో చర్చకు వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తే, వాటిని నిర్ద్వందంగా తిరస్కరిస్తామని యనమల తేల్చిచెప్పారు. మండలి తిరస్కరించిన పాతపాలసీలను ప్రభుత్వం పక్కనపెడితేనే మంచిదన్నారు. ప్రతిపక్షం తనకున్న అధికారాలను ఉపయోగించుకునే హక్కుని ఎవరూ కాదనలేరని, ఆ రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పోకుండా చేసింది ప్రభుత్వమే కాబట్టి, త్వరలోజరగబోయే సమావేశాల్లో మండలిలో ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. 

 

ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా, ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయాలను ఆమోదించాలని చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు మార్చుకోకుంటే ప్రభుత్వానికి సరైనవిధంగా గుణపాఠం చెప్పి తీరుతామని యనమల తేల్చిచెప్పారు. రాష్ట్రప్రతిష్టకు సంబంధించిన అంశాలను, బలవంతంగా ఆమోదింపచేసుకోవాలని జగన్ సర్కారు చూస్తే, తాము చట్టప్రకారం తమకున్న హక్కులను ఉపయోగించుకుంటామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, వీలైనంతవరకు ఆ రెండు అంశాలను సభ ముందకు తీసుకురాకుండా ఉంటేనే మంచిదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: