మేడారం జాతర కానుకల లెక్కింపు పూర్తయింది. వాటాల పంపకాలపై దృష్టి పెట్టారు అధికారులు. ఏళ్ల తరబడి అమలులో ఉన్న నిబంధనల మేరకు విభజన చేశారు. పూజారులకు పావు శాతం వాటాతో వాళ్లకు దాదాపు నాలుగుకోట్ల ఆదాయం వచ్చింది.

  

మేడారం జాతర ఈసారి దిగ్విజయంగా సాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ,విదేశాల నుంచి లక్షలాది భక్తులు విచ్చేసి జాతరను విజయవంతం చేశారు. సమ్మక్క సారక్కలకు మొక్కులు తీర్చుకున్నారు. తమకు శక్తికొలదీ కానుకలు సమర్పించుకున్నారు.  మేడారం జాతర లో భక్తుల తాకిడి దృష్ట్యా 502 హుండీలను ఏర్పాటు చేశారు.  


 
ఫిబ్రవరి 12న మొదలైన మేడారం జాతర హుండీ లెక్కింపు కార్యక్రమం 27న పూర్తయింది. సుమారు 15 రోజుల పాటు జరిగిన కానుకలు లెక్కింపులో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు  11 కోట్ల 64లక్షల 61వేల 774 ఆదాయం వచ్చింది. ఇలా వచ్చిన ఈ కానుకలను దేవతల వారీగా విభజించారు.  

 

ఇందులో పూజారులకు 33.3శాతం వాటాగా  3కోట్ల 87లక్షల 81వేల 770 చెల్లించనున్నారు. అదే విధంగా దేవాదాయశాఖ చట్టం ప్రకారం దేవాలయాలకు వచ్చిన ఆదాయం నుంచి 22శాతం చెల్లించడం ఆనవాయితీ. ఈ లెక్కన ప్రభుత్వ ఖజనాకు  2కోట్ల 56లక్షల 21వేల 590 చెల్లించాల్సి ఉంది. ఇక కానుకల్లో వనదేవతలకు 5కోట్ల 20లక్షల 58వేల 414 మాత్రమే మిగిలేది. 

 

సమ్మక్క, సారలమ్మ గద్దెల ఏర్పాటు చేసిన హుండీల ద్వారా 10కోట్ల 93లక్షల 83వేల 539 ఆదాయం లభించింది. ఇందులో పూజారులకు 33.3శాతం అంటే 3కోట్ల 64లక్షల 24వేల 718 ఇవ్వాలి. దీనిని సమ్మక్క పూజారులు 9మంది పంచుకుంటారు. ఒక్కొక్కరికి 33లక్షల11వేల 338 చొప్పున వస్తాయి.  

 

అదేవిధంగా పగిడిద్దరాజు హుండీ నుంచి లభించిన 35లక్షల 99వేల 520 రూపాయల కానుకల నుంచి పూజారి పెనక బుచ్చిరామయ్యకు 33.3వాటా చొప్పున 11లక్షల 76వేల 662 లభిస్తుంది. గోవిందరాజు హుండి నుంచి లభించిన  34లక్షల 78వేల 715 రూపాయల  కానుకల నుంచి పూజారి దబ్బకట్ల గోవర్ధన్‌కు 11లక్షల 58వేల 412 రూపాయల ఆదాయం వస్తుంది.  

 

పగిదిద్ద రాజు, గోవిందరాజు, సారక్కల పూజారులు.. సమ్మక్క పూజరులకు సుంకం చెల్లించాల్సి ఉంటుంది. సమ్మక్క దేవత ఒక్కరే మేడారంలో ఉంటారు. వివిధ గ్రామాల నుంచి తీసుకొచ్చి మేడారం గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠించినందుకు,  జాతరలో పూజారులకు వచ్చిన ఆదాయం నుంచి సమ్మక్క దేవతకు సుంకం చెల్లించాల్సి ఉంటుంది. సారలమ్మ పూజారులు 7శాతం, పగిడిద్దరాజు పూజారులు 25శాతం, గోవిందరాజు పూజారులు 12శాతం సుంకం చెల్లించాలి. ఇలా అధికారులు అన్ని లెక్కలు చేసి మేడారం వనదేవతల జాతర కానుకల విభజనను పూర్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: