మణిపూర్ మహిళలు కదంతొక్కారు. అర్థరాత్రి సమయంలో పెద్దసంఖ్యలో మహిళలు వీధుల్లోకి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా మణిపూర్ మహిళా కమిషన్ నిర్వహించిన ర్యాలీని.. జెండా ఊపి సీఎం బైరెన్ ప్రారంభించారు. ప్రభుత్వం మహిళాభ్యుదయానికి కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. 

 

ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అంటూ చాలా మాటలు వినిపిస్తుంటాయి.. ఆదిశక్తి, పరాశక్తి అంటూ దేవతలతో పోల్చడం కామన్‌గానే  జరుగుతోంది. కాని మహిళా సాధికారత ఇప్పటికీ అందని ద్రాక్షగానే మారింది. ఈ పరిస్థితిలో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మహిళలు ముందడుగేశారు. పగలే కాదు రాత్రి మాదే అంటూ అర్థరాత్రి సమయంలో మహిళలు పెద్దసంఖ్యలో ఇళ్ల నుంచి భారీగా తరలివచ్చి ర్యాలీ తీశారు.

 

మణిపూర్‌లో మహిళాసాధికారతే లక్ష్యంగా పవర్ వాక్‌ నిర్వహించింది ఆరాష్ట్ర మహిళా కమిషన్.మా దుస్తులు మాఇష్టం. మాకు నచ్చినవి ధరిస్తాం. మీకెందుకని ర్యాలీకి హాజరైన కొందరు మహిళలు ప్రశ్నించారు.మేం రాత్రైనా, పగలైనా నిర్భయంగా సంచరిస్తాం. మాజోలికి వస్తే సహించేది లేదంటూ మరికొందరు ప్లకార్డులు ప్రదర్శించారు.

 

మహిళలు అన్ని విషయాల్లో పురుషులకు సమానమనీ... అర్థ రాత్రైనా మహిళలు ధైర్యంగా రోడ్లపై నడిచి వెళ్లొచ్చని చెప్పడమే పవర్ వాక్ లక్ష్యమన్నారు మణిపూర్‌ సీఎం బైరెన్‌. అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వారి భద్రతకు తాము భరోసాగా ఉంటామన్నారు. జిల్లాల్లో ఎస్పీలుగా, డిప్యూటీ కమిషనర్లుగా మహిళలను నియమించామన్నారు. అలాగే మహిళలపై దాడులకు పాల్పడేవారిపై త్వరిత గతిన విచారణ కోసం ...ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  రెండు  పోస్కో కోర్టులు ఏర్పాటు చేశామన్నారు.

 

మహిళలు రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కేస్తున్నారన్నారు మణిపూర్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ బినోటా. మణిపూర్‌ అసెంబ్లీలో కేవలం ఒకే ఒక్క మహిళ ప్రాతినిథ్యం వహిస్తున్నారని... ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్‌లో పవర్ వాక్ నిర్వహించారు. తమిళనాడు,ఒడిషా సహా పలు రాష్ట్రాల్లో నిర్వహించిన పవర్ వాక్‌లో పాల్గొన్న మహిళలు... అన్నిరంగాల్లోనూ సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: