ఎంతటి బలవంతులైనా, పెద్దవాళ్లై ఇంజక్షన్ చేయించుకోవాలంటే భయపడే వారు చాలా మంది ఉన్నారు. అది కూడా డాక్టర్ సమక్షంలో అన్ని జాగ్రత్తలతో సూది వేస్తామంటేనే వణికిపోయేవారు ఉన్నారు. మరి అలాంటిది ఏకంగా సూది మొత్తం శరీరంలోకి వెళ్లిపోతే ఎంత బాధ.. అందులోనూ ఒకటి కాదు.. రెండు కాదు..ఏకంగా పది సూదులు.. ఉన్నాయి.

 

 

ఈ విచిత్రమైన సంఘటన వనపర్తి జిల్లా వీపనగండ్లలో జరిగింది. అభం శుభం తెలియని చిన్నారి.. చిన్న దెబ్బ తగిలినా.. తట్టుకోలేని వయస్సులో ఒంట్లో సిరంజీ సూదులతో నరకం అనుభవించాడు. నిండా మూడేళ్లు లేని పిల్లవాడు ఆ సూదులతో నరక యాతన పడ్డాడు. వీపనగండ్ల మండల కేంద్రానికి చెందిన పెబ్బేటి అశోక్‌, అన్నపూర్ణ దంపతుల మూడేళ్ల కుమారుడు లోకనాథ్‌... కొన్ని రోజులుగా రోజంతా ఏడుస్తూనే ఉంటున్నాడు.

 

 

ఏం చేయాలో పాలుపోక.. పిల్లల డాక్టర్ వద్దకు తీసుకెళ్లినా ఏమీ తేలలేదు. చివరకు ఒళ్లంతా పరిశీలిస్తే.. బాలుడి మలద్వారం వద్ద ఒక సూది కనిపించిందట. దాంతో అనుమానం వచ్చిఎక్స్ రే తీయించారు. ఆ ఎక్స్ రే చూసి ఒక్కసారిగా షాకయ్యారట. ఎందుకంటే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పిల్లాడి శరీరంలో 10 సూదులు ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. బాబు శరీరంలో 10 సూదులు ఉన్నాయి. అన్నింటినీ ఒకేసారి వెలికితీయటం సాధ్యం కాదు. శస్త్ర చికిత్స నిర్వహించి కొన్ని సూదులను తొలగించామని చెబుతున్నారు వైద్యులు.

 

 

అసలు పిల్లవాడి శరీరంలోకి ఈ సూదులు ఎలా వచ్చాయో అర్థం కాక తల్లిదండ్రులు తలపట్టుకున్నారు. ఇక లాభం లేదనుకుని ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి శరీరంలోకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సూదులను గుచ్చారని కంప్లయింట్ ఇచ్చారు. పూర్తిగా విచారించి బాధ్యులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు అంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: