ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా (కొవిడ్‌-19)  క‌ల‌క‌లం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. వివిధ దేశాల్లో పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు చ‌నిపోతున్నారు, ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు.  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాభారత్‌ను కూడా వదలట్లేదు. తాజాగా ఇద్దరు భారతీయులకు ఈ వైరస్‌ సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. అలాగే, మన దేశ పర్యటనకు వచ్చిన ఒక విదేశీయుడికి కూడా కరోనా సోకినట్టు గుర్తించామని రాజస్థాన్‌ ప్రభుత్వం పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటివరకూ ఆరు కరోనా కేసులు నమోదైనట్టు అయింది. అయితే, ఈ మ‌హ‌మ్మారికి విరుగుడు గోమూత్రం అని ఓ మ‌హిళ సెల‌విచ్చారు.

 

 

అస్సాం రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాల స‌మ‌యంలో బంగ్లాదేశ్‌కు అక్ర‌మంగా గోవులను త‌ర‌లిస్తున్నార‌న్న అంశంపై చ‌ర్చ జ‌రిగింది. ఆ చ‌ర్చ‌లో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే హ‌రిప్రియ‌.. గోవుల గొప్ప‌త‌నం గురించి చెప్పుకొచ్చారు.  క‌రోనా వైర‌స్ సోకిన వారికి కూడా గోమూత్రం ప‌నిచేస్తుంద‌న్నారు. ఆవు పేడ ఎంత విశిష్ట‌మైందో అంద‌రికీ తెలిసిందే, అలాగే గోవు మూత్రాన్ని కూడా చ‌ల్లితే, ఆ ప్రాంతాన్ని అది శుద్ధి చేస్తుంద‌ని, గోమూత్రం, ఆవుపేడ‌ల‌తో.. క‌రోనా వైర‌స్‌ను కూడా అదుపు చేయ‌వ‌చ్చు అన్న అభిప్రాయాన్ని ఆమె వినిపించారు.  క్యాన్స‌ర్‌తో పాటు ఇత‌ర అనేక వ్యాధుల‌కు గోవుల ద్వారా చికిత్స అందిస్తార‌ని,  గుజ‌రాత్‌లోని ఓ ఆయుర్వేదిక్ హాస్పిట‌ల్లో.. క్యాన్స‌ర్ పేషెంట్ల‌ను గోవుల‌తో గ‌డిపేలా చేస్తార‌ని, వారికి పేడ‌ను రుద్దుతార‌ని, గోమూత్రం నుంచి త‌యారు చేసిన పంచామ్రుతాన్ని ఇస్తార‌ని అస్సాం బీజేపీ ఎమ్మెల్యే సుమ‌న్ హ‌రిప్రియ అన్నారు. క‌రోనా వ్యాధితో బాధ‌ప‌డేవారికి గోవు మూత్రం, ఆవు పేడ‌తో చికిత్స అందింవ‌చ్చు అని తెలుప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైద్యుల పర్యవేక్షణలో 25,738 మంది ఉన్నారని వీరిలో 37 మందిలో వ్యాధి లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నామని కేంద్ర ప్ర‌భుత్వ అధికారులు తెలిపారు. కరోనా తీవ్రమవుతున్న నేపథ్యంలో అవసరముంటే తప్ప ఇరాన్‌, ఇటలీ, దక్షిణ కొరియా, సింగపూర్‌ వంటి దేశాలకు ప్రయాణించొద్దని కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ సూచించారు. కరోనాను గుర్తించడం, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తతతో ఉన్నట్టు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: