ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన విషయం తెలిసిందే. 2019 ఆగష్టు నుండి రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు విధులు నిర్వహిస్తుండగా 2020 జనవరి 26 నుండి సచివాలయ వ్యవస్థ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తాజాగా అనంతపురం జిల్లాలో వాలంటీర్, సచివాలయ ఉద్యోగిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. 
 
అనంతపురం జిల్లా గోరంట్ల ఆర్కే వీధికి చెందిన వేణు గ్రామ వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. వేణు సచివాలయ ఉద్యోగి ఉషను ప్రేమించి తనను ప్రేమించాలని కోరాడు. ఉష మాత్రం అతని ప్రేమను తిరస్కరించింది. ఆ తరువాత వేణు ప్రేమించాలంటూ యువతి వెంట పడుతూ వేధింపులకు గురి చేశాడు. ప్రేమించకపోతే చనిపోతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. 
 
వేణు ఉషను మాట్లాడాలని పిలిపించి ఆమె ముందు పురుగులమందు తాగి ఆమెకు కూడా బలవంతంగా పురుగుల మందు తాగించాడు. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న వేణు, ఉషను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరిలో ఉష పరిస్థితి మెరుగ్గానే ఉండగా వేణు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. మెరుగైన వైద్య చికిత్స కోసం వేణు తల్లిదండ్రులు అతనిని హిందూపురం ఆస్పత్రికి తరలించారు. 
 
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఉషను అడిగి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వాలంటీర్, ఉద్యోగిని పురుగులమందు తాగిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వేణు స్పృహలోకి వస్తే ఈ కేసులో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది. పోలీసులు వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను కేసు గురించి విచారిస్తున్నారు.              

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: