ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజ్యసభ సీట్లను ఆశిస్తున్న ఆశావహుల జాబితా భారీగానే ఉంది. ఏపీలో రాజ్యసభ సీటు కోసం కొన్ని రోజుల క్రితం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సీఎం జగన్ ను కలిశారు. ముఖేష్ తన సన్నిహితుడైన పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటును కేటాయించాలని జగన్ ను కోరారు. తాజాగా పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు ఖాయమైందని ప్రచారం జరుగుతోంది. 
 
పరిమళ్ నత్వానీ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో మీడియాతో మాట్లాడుతూ జగన్ ను రాజ్యసభ సీటు కోసమే కలిసినట్టు చెప్పారు. జగన్ మూడు రోజుల సమయం కావాలని కోరారని దాదాపుగా సీటు ఖాయమైనట్లేనని అన్నారు. జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు అమిత్ షా పరిమళ్ కు సీటు కేటాయించాలని కోరారని... అందుకే ముఖేష్, పరిమళ్ జగన్ ను కలిశారని తెలుస్తోంది. జగన్ పరిమళ్ నత్వానీకి ఒక సీటు ఫిక్స్ చేయడంతో రాజ్యసభ సీట్లను ఆశిస్తున్న వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. 
 
ఇప్పటికే వైసీపీ శాసనమండలి రద్దు దిశగా అడుగులు వేయడంతో ఎమ్మెల్సీ సీట్లను ఆశించిన నేతలు రాజ్యసభ సీట్లపై ఆశలు పెట్టుకున్నారు. రాజ్యసభ రేసులో చాలామంది పేర్లు వినిపిస్తున్నా జగన్ మదిలో ఉన్న నేతల పేర్లు తెలియాల్సి ఉంది. రేసులో ఉన్న నేతలు తమ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని టెన్షన్ పడుతున్నారు. రాజ్యసభ రేసులో బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, రాంకీ అయోధ్య రామిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. 
 
చిరంజీవి, షర్మిళ పేర్లు కూడా వినిపిస్తున్నా వైసీపీ వీరిద్దరికి రాజ్యసభ సీట్లు కేటాయించే అవకాశాలు లేవని సమాచారం. ఆశావహులు భారీ సంఖ్యలో ఉండటంతో రాజ్యసభ సీట్ల విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. జగన్ రాజ్యసభ సీటు కేటాయిస్తున్న పరిమళ్ నత్వానీ ఇప్పటికే రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. పరిమళ్ కు బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. 2008, 2014లో జార్ఖండ్ నుండి నత్వానీ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: