ఏపీ సీఎం జగన్ తన రూటు మారుస్తున్నారు. ఇన్నాళ్లూ సంక్షేమంపై మాత్రమే దృష్టి పెట్టి మంచి మార్కులు కొట్టేసిన జగన్.. ఇప్పుడు అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణపై వ్యూహరచన చేస్తున్నారు. భూముల అమ్మకం ద్వారా తొలిదశలో 3వేల కోట్ల రూపాయలు సమీకరించాలనేది టార్గెట్..! అంతేకాదు.. నిధులు, పెట్టుబడులకోసం ఆయా రంగాల్లోని ఎక్స్‌పర్ట్స్‌ని సలహాదారులుగా నియమించుకుంటున్నారు జగన్.

 

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనా పగ్గాలు చేపట్టి.. ఇప్పటికి తొమ్మిది నెలలు గడిచింది. ఈ తొమ్మిది నెలల కాలంలో జగన్ తనపై.. తన పాలనపై సంక్షేమ ముద్ర వేయించుకోవడంలో సక్సెస్ అయ్యారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై ప్రధానంగా దృష్టి పెట్టి వాటిపైనే ఎక్కువగా నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమమే తన ప్రధాన అజెండా అనే ముద్ర వేసుకున్నారు. 

 

 అయితే క్రమంగా మార్పు మొదలైంది. రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు ఆర్థిక పరిపుష్టి సాధించాలనేది జగన్ తాజా ఆలోచన. అందుకు అనుగుణంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. మిషన్ బిల్డ్ ఏపీ కింద దశలవారీగా నిధులు సేకరించేందుకు అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం భూములు అమ్మాలని ప్రతిపాదించారు. తొలిదశలో 3వేల కోట్ల రూపాయల విలువైన నిధులు సమీకరించాలనేది లక్ష్యం. విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లోని ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా ఈ మొత్తం సమకూర్చుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. వీలైనచోట్ల రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్ ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం ఎన్బీసీసీ ద్వారా ఒక పైలెట్ వెంచర్ చేపట్టాలనే ప్రతిపాదనకు సీఎం జగన్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 

మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను వేగవంతం చేస్తోంది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంతో పనులు వేగవంతం కానున్నాయి. పీపీఏలను చెల్లిస్తుండడంతో కేంద్రంతో గొడవలు లేకుండా నిధులు రాబట్టుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. 

 

ఆర్థిక క్రమశిక్షణకోసం అవసరమైతే నిపుణుల అభిప్రాయాలను తీసుకునేందుకు సీఎం జగన్ సంసిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గర్గ్ ను సలహాదారుగా నియమించారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టరుగా పనిచేసిన అనుభవం గర్గ్‌ సొంతం. అలాగే కార్తికేయ మిశ్రాను కూడా ప్రత్యేకంగా నిధుల సమీకరణ కోసం కేటాయించారు. దీంతో నిధుల సమీకరణపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది.

 

బిల్డ్ ఏపీ, కనెక్ట్ టూ ఆంధ్రా వంటి పథకాలపై జగన్ దృష్టి పెట్టారు. బిల్డ్ ఏపీ ద్వారా భూములను అమ్మి నిధులు సమీకరించనున్నారు. కనెక్ట్ టూ ఆంధ్రా స్కీమ్ ద్వారా వివిధ కార్పోరేట్ కంపెనీల నుంచి సీఎస్సార్ నిధులను అభివృద్ధి పనులకు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించుకోనున్నారు. ఇన్నాళ్లూ సంక్షేమంపై మాత్రమే దృష్టి పెట్టిన జగన్.. ఆ విషయంలో మంచి మార్కులే కొట్టేశారు. ఇప్పుడు నిధుల సమీకరణపై దృష్టి సారించడంతో ఇక  అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుందనే ఆశాభావం కనిపిస్తోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: