గత రెండు రోజులుగా ఏపీ రాజకీయాలు రిజర్వేషన్లు చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జగన్ సర్కారు జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టిపారేసింది. 50 శాతానికి మించకూడదని కీలక ప్రకటన చేసింది. అయితే ఈ 50 శాతంలోనే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్లు అలాగే ఉంచి, బీసీల రిజర్వేషన్లు తగ్గించాలి.

 

మామూలుగా ఏపీ జనాభాలో 70 శాతం మంది బీసీలే కావడంతో స్థానిక సంస్థల్లో వారికి రిజర్వేషన్లు పెంచుతూ జగన్ ప్రభుత్వం మొత్తం రిజర్వేషన్లను 59.85కు పెంచింది. కానీ హైకోర్ట్ రిజర్వేషన్లను 50 శాతంలోపే ఉండాలని చెప్పడంతో, ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుందన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే దీనిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. రిజర్వేషన్లపై కేసు వేసింది టీడీపీ నేతే అని, బీసీలకు అన్యాయం చేసింది ప్రతిపక్ష టీడీపీ పార్టీనే అంటూ వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు బీసీ ద్రోహి అంటూ వైసీపీ అనుకూల మీడియా ఏకీపారేస్తుంది.

 

ఇక వైసీపీ వాళ్ళకు ఏ మాత్రం తగ్గకుండా జగన్ బీసీల వెన్నెముక విరిచేశారని, టీడీపీకి అండగా ఉంటారనే బీసీలకు అన్యాయం చేశారని, రిజర్వేషన్లపై కోర్టులో కేసు వేసిన బిర్రు ప్రతాప్ రెడ్డి వైసీపీ అనుకూల నాయకుడు అంటూ విరుచుకుపడుతున్నారు. అటు వైసీపీ వాళ్ళు ప్రతాప్ రెడ్డి చంద్రబాబుతో ఉన్న ఫోటోని చూపిస్తుంటే, ఇటు టీడీపీ వాళ్ళు జగన్‌తో ఉన్న ఫోటోని చూపిస్తున్నారు.

 

అయితే కేసు వేసిన వ్యక్తి ఏ పార్టీ అయిన గానీ, ఇప్పుడు వైసీపీ-టీడీపీ నేతలు చేసిన మాటల యుద్ధం వల్ల ఏమన్నా ఒరిగిందా అంటే? ఏం లేదనే చెప్పాలి. ఈ విషయంలో ఎవరికి డ్యామేజ్ జరిగింది లేదు. దీని వల్ల బీసీలు ఒకేసారి వైసీపీకి అనుకూలంగా మారరు. అలాగే టీడీపీకి ఫేవర్‌గా ఉండరు. ఈ రిజర్వేషన్లు ఎన్నికలకు సంబంధించిందే కాబట్టి, ఆయా పార్టీల్లో ఉంటూ, స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే బీసీ నేతలకు కాస్త ఇబ్బంది ఉంటుంది. ఇక వారు ఎలాగో పార్టీ వారీగానే నడుస్తారు కాబట్టి, సాధారణ బీసీ ఓటర్లపై ఈ రిజర్వేషన్ల ప్రభావం ఉండదనే చెప్పుకోవచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: