ఏపీ రాజకీయాల్లో శతృత్వం ఉన్న ఓ ఇద్దరు నేతలకు...మళ్ళీ చాలారోజుల తర్వాత పడింది.. ఒకప్పుడు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న ఈ నేతలు మరోసారి పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించారు. అలా ఎప్పటి నుంచో శతృత్వం కొనసాగిస్తున్న నేతలు ఎవరో కాదు. ఒకరు అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా, మరొకరు ప్రతిపక్ష టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా. అసలు ఈ ఇద్దరు నేతలకు 2014 నుంచే శతృత్వం మొదలైంది.

 

ఇద్దరు తొలిసారి ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీ సాక్షిగా తలపడ్డారు. 2014లో టీడీపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పుడు రోజా నగరి ఎమ్మెల్యేగా ప్రతిపక్ష వైసీపీలో ఉన్నారు. ఇటు బొండా ఉమా విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఒకానొక సమయంలో అసెంబ్లీలో ఆందోళన చేసే సందర్భంలో రోజాకు, బొండా ఉమాకు గట్టిగా పడింది. తన సహచర ఎమ్మెల్యే అనితని రోజా వ్యక్తిగతంగా దూషించడంపై బొండా మాట్లాడుతూ...రోజాని ఆంటీ అంటూ కామెంట్ చేశారు. ఇదే సమయంలో రోజా కూడా వాడేమైనా కుర్రాడా అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కాకపోతే అప్పుడు టీడీపీ అధికారంలో ఉండటం వల్ల రోజానే గట్టిగానే ఆడుకున్నారు. ఒకానొక సమయంలో అసెంబ్లీ నుంచి సస్పెండ్ కూడా చేశారు.

 

అయితే ఇప్పుడు పవర్ మారింది. రోజా అధికారంలో ఉన్నారు. బొండా ఎమ్మెల్యేగా గెలవలేదు. పైగా ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ క్రమంలోనే బొండా ఏపీలో మద్యం అక్రమాలు జరుగుతున్నాయి అంటూ, జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏవో కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చి అమ్మేస్తున్నారంటూ, ప్రెస్ మీట్లో మద్యం బాటిళ్ళని ప్రదర్శించారు. ఇక ఇక్కడ నుంచే రోజా అందుకున్నారు.

 

మద్యపాన నిషేధం దిశగా జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని, టీడీపీ ఆఫీసులో ప్రదర్శించారంటే అది టీడీపీ ఆఫీసా లేక బార్ షాపా అని సెటైర్ వేశారు. బార్ సేల్స్ మేన్‌లా బొండా‌ ఉమా మాట్లాడుతున్నారని, ప్రతిపక్ష నాయకుడు తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిలా కనిపిస్తున్నారని పెద్ద కామెంటే చేశారు. మొత్తానికైతే చాలారోజుల తర్వాత తన శత్రువు బొండా ఉమా లక్ష్యంగా రోజా స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: