రెండు సంవత్సరాల నుంచి పెండింగ్‌లో పడుతూ..వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మార్చి నెలాఖరులోపే ఎన్నికలు నిర్వహించడానికి సీఎం జగన్ రెడీ అయ్యారు. ఇక లోకల్ బాడీ ఫైట్ మొదలు కానున్న నేపథ్యంలో పార్టీలు గెలుపు వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. అలాగే సీట్లు దక్కించుకునేందుకు నేతలు పోటీ పడటానికి రెడీగా ఉన్నారు. సర్పంచ్, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి సీట్లలో పోటీకి ద్వితీయశ్రేణి నేతలు ప్రధాన నేతలని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. అటు కొందరు పెద్ద నేతలు కూడా జెడ్పీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల చైర్మన్లపై కన్నేశారు.

 

ఇదే సమయంలో పదవుల కోసం టీడీపీ నేతలు జంప్ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఎలాగో భారీ మెజారిటీతో అధికారంలో ఉంది కాబట్టి, ఆ పార్టీలో ఉంటే గెలుపు సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అలాగే టీడీపీలో బలమైన అభ్యర్ధులు ఉంటే వారిని లాగేసుకుని, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని వైసీపీ చూస్తోంది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయాక, ఆ పార్టీని చాలామంది నేతలు విడిచి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే.

 

మొదట్లో కొందరు నేతలు బీజేపీలోకి వెళ్లగా, తర్వాత వైసీపీలోకి వెళ్లారు. ఇక ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలు కూడా వైసీపీకి సపోర్ట్ ఇవ్వగా, ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా బాబుకు హ్యాండ్ ఇచ్చారు. అయితే కొంతకాలం నుంచి ఈ వలసల కార్యక్రమానికి బ్రేక్ పడినట్లు కనిపిస్తుంది. పెద్దగా ఎవరు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన దాఖలాలు లేవు.

 

కానీ స్థానిక సంస్థల ఎన్నికల రానుండటంతో ఈ వలసలు ఊపు అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అవకాశం బట్టి చోటా, మోటా నేతలు టీడీపీని వీడే ఛాన్స్ ఉంది. అలాగే కొందరు బడా నాయకులు కూడా బాబుకు షాక్ ఇచ్చే అవకాశముంది. దీంతో బాబు వరుసగా వెళ్లిపోతున్న నేతలని లెక్కపెట్టుకుంటూ ఉండాలి. అలాగే పార్టీకి డ్యామేజ్ జరగకుండా పరిస్థితులని చక్కదిద్దుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: